ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ చెస్ జట్టు ఎంపిక
విజయవాడస్పోర్ట్స్: డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం చదరంగం జట్టును వర్సిటీ స్పోర్ట్స్ బోర్డ్ సెక్రటరీ డాక్టర్ ఇ.త్రిమూర్తి ప్రకటించారు. జట్టుకు బి.దీపక్ (ప్రభుత్వ వైద్య కళాశాల, అనంతపురం), కె.లోకేష్ (ప్రభుత్వ వైద్య కళాశాల, అనంతపురం), కె.అభినవ్ చంద్ర (సిద్ధార్థ మెడికల్ కాలేజీ, విజయవాడ), కె.త్రివేద్‌కుమార్ (సిద్ధార్థ మెడికల్ కాలేజీ, విజయవాడ), ఎన్.టెండుల్కర్ (ప్రభుత్వ వైద్య కళాశాల, నంద్యాల), ఎ.రత్నాకర్(సెయింట్ జోసఫ్ దంత కళాశాల, ఏలూరు) ఎంపికై నట్లు పేర్కొన్నారు. ఈ నెల ఎనిమిది నుంచి 11వ తేదీ వరకు చైన్నెలో జరిగే దక్షిణ భారత అంతర వర్సిటీల చదరంగం పోటీలకు ఈ జట్టు ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. జట్టు బృందాన్ని హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ వి. రాధికరెడ్డి, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ డాక్టర్ సీహెచ్ శ్రీనివాసరావు అభినందించారు.
కలిసికట్టుగా జీవించడమే క్రైస్తవ్యం
ఉంగుటూరు: ఎటువంటి తారతమ్య భేదాలు లేకుండా ప్రజలు అందరూ కలసికట్టుగా ముందుకు సాగే ప్రయాణమే క్రైస్తవ జీవితమని విశాఖ మేత్రాసనం, కోడూరు మాత పుణ్యక్షేత్ర డైరెక్టర్ ఫాదర్ పసుపులేటి యుగల్ కుమార్ అన్నారు. మండలంలోని పెద్ద అవుటపల్లిలో బ్రదర్ జోసఫ్ తంబి 80వ వర్ధంతి మహోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న నవదిన ప్రార్థనలు మంగళవారం నాల్గో రోజు కొనసాగాయి. ఈ సందర్భంగా ఫాదర్ యుగల్ పుణ్యక్షేత్ర ఫాదర్‌లతో కలసి దివ్య పూజాబలిని సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీసభ, క్రైస్తవుల సమూహ ప్రయాణం అనే అంశంపై ప్రసంగించారు. క్రీస్తు నందు విశ్వాసంతో అందరు ఐక్యంగా జీవించాలని బోధించారు. ఫాతిమానగర్ సంఘస్తులు, ఎఫ్‌సీసీ సిస్టర్స్ భక్తిగీతాలతో కొనియాడారు. పుణ్యక్షేత్ర రెక్టర్ పాలడుగు జోసఫ్, విచారణ గురువు గోపి అభిలాష్ తదితరులు పాల్గొన్నారు.
అలరించిన నృత్య ప్రదర్శన
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిధిలో విశాఖపట్నం పెందుర్తికి చెందిన శ్రీ నిర్మల నృత్య నికేతన్‌కు చెందిన పలువురు కళాకారులు కూచిపూడి నృత్య ప్రదర్శన ఇచ్చారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ధర్మపథం వేదికపై మంగళవారం సాయంత్రం పంచహారతుల సేవ అనంతరం నృత్య ప్రదర్శన జరిగింది. బి.విజయజ్యోతి పర్యవేక్షణలో కళాకారుల బి. సాయిశ్రీ, సర్వాణిదేవి, రేణుకాసాయి, డి.పూజ, శ్రీసాహితీ, జి. మేఘన, కె. సాహితీ కృష్ణలతో పాటు పలువురు చిన్నారులు నృత్య ప్రదర్శనలో పాల్గొన్నారు. నృత్య ప్రదర్శన అనంతరం శిష్యబృందానికి అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ అధికారులు ప్రసాదాలను అందజేశారు.
హోరాహోరీగా వాలీబాల్ టోర్నీ
విజయవాడస్పోర్ట్స్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌జీఎఫ్‌ఐ) జాతీయ అండర్–19 బాలికల వాలీబాల్ పోటీలు మంగళవారం రెండో రోజు హోరాహోరీగా సాగాయి. మొగల్రాజపురంలోని పీబీ సిద్ధార్థ కాలేజీ మైదానంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. రెండో రోజుల పాటు జరిగిన లీగ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, సీఐఎస్‌ఈ, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, హిమాచల్‌ప్రదేశ్, తెలంగాణ, హరియాణా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, పంజాబ్, మహారాష్ట్ర, కేరళ, గుజరాత్, పశ్చిమబెంగాల్ జట్లు ముందజలో కొనసాగుతున్నాయి. వీటిల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, సీఐఎస్‌ఈ, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా రాష్ట్రాలు పూల్ విన్నర్‌లుగా నిలిచి ప్రీ క్వార్టర్స్‌కు చేరినట్లు ఎస్‌జీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి జి.భానుమూర్తిరాజు, పోటీల కార్యనిర్వాహక కార్యదర్శి వి.రవికాంత వెల్లడించారు. మరో పది జట్లు ప్రీ క్వార్టర్స్‌కు వస్తాయని, బుధవారం నుంచి ప్రీ క్వార్టర్స్ పోటీల్లో జట్లు తలపడతాయని వారు వివరించారు. బుధవారం రాత్రి ఎనిమిది గంటలకు క్యాంప్‌ఫైర్ ఉంటుందని తెలిపారు. ఈ నెల పదో తేదీ వరకు జరిగే ఈ పోటీలకు దేశ వ్యాప్తంగా 26 రాష్ట్రాల జట్లు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. మంగళవారం జరిగిన పోటీలను భారత సీనియర్ వాలీబాల్ కోచ్ జి.వి.ప్రసాద్, సీనియర్ వాలీబాల్ క్రీడాకారుడు నాదెళ్ల బ్రహ్మాజీ పరిశీలించి, క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment