పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాలి
చిలకలపూడి(మచిలీపట్నం): పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖరరావు అన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో మండల విద్యాశాఖాధికారులకు సహిత విద్య, బడి బయట విద్యార్థుల నమోదు తదితర అంశాలపై ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఆర్వో మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థుల కోసం పాఠశాలల్లో ర్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. మరుగుదొడ్ల ఏర్పాటు, విద్యార్థులకు అందించాల్సిన సామగ్రి, మధ్యాహ్న భోజన పథకం, ఉపకరణాలు అందించటం, వైద్యశిబిరాలు నిర్వహించటం వంటివి పకడ్బందీగా అమలు చేయాలన్నారు. దృష్టిలోపం ఉన్న విద్యార్థులకు బోధన అభ్యసన సామగ్రి, కిట్లను పంపిణీ చేయాలన్నారు. సమగ్ర శిక్ష అడిషనల్ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ ఎ రాములునాయక్ మాట్లాడుతూ దివ్యాంగ విద్యార్థులకు ట్యాబ్‌ల ద్వారా బోధన, అలవెన్సులు అందించటం, ఫిజియోథెరపీ, ఉపకరణాల పంపిణీ చేపడుతున్నామన్నారు. సమగ్ర శిక్ష అసిస్టెంట్ ఐఈడీ కో–ఆర్డినేటర్ పి వనజ, సమగ్ర శిక్ష సహిత విద్య కో–ఆర్డినేటర్ ఎస్. రాంబాబు, సెక్టోరియల్ సిబ్బంది డి. గణేష్, టి. రమేష్, అబ్దుల్ సుభాన్, కె. ఏడుకొండలు తదితరులు పాల్గొన్నారు.
జిల్లా రెవెన్యూ అధికారి చంద్రశేఖరరావు
Comments
Please login to add a commentAdd a comment