విద్యార్థినులకు ‘కిట్స్’ పంపిణీ
మచిలీపట్నంటౌన్: సంక్షేమ వసతి గృహ విద్యార్థులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు వినియోగించుకుని వృద్ధిలోకి రావాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ విద్యార్థులకు సూచించారు. జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, డీఆర్‌ఓ కె. చంద్రశేఖరరావులతో కలిసి కలెక్టర్ స్థానిక బచ్చుపేటలోని సాంఘిక సంక్షేమ శాఖ బాలికల నాలుగో నంబర్ వసతి గృహాన్ని మంగళవారం రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు ఎగ్జామ్ ప్యాడ్, పెన్, స్కేల్, జామెంట్రీ బాక్స్, కొబ్బరి నూనె, ఫేస్ పౌడర్, హెయిర్ పిన్స్, టవల్, నాప్కిన్‌లతో కూడిన కిట్స్ అందజేశారు. వసతి గృహంలోని ప్రతిరూముకు మస్కిటో రీఫిల్స్, మెషిన్స్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించుకొని, అందుకు తగిన విధంగా కష్టపడి పని చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థినులతో కొద్దిసేపు ముచ్చటించి వారి భవిష్యత్ లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. మంగళవారం కలెక్టర్ తన జన్మదినాన్ని పురస్కరించుకొని విద్యార్థినులతో కలిసి కేక్ కట్ చేశారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ మధుసూదన్ రావు, ఏఎస్‌డబ్ల్యూఓ శీలం రాజశేఖర్ రెడ్డి, హెచ్‌డబ్ల్యూఓ సూర్య బేగం పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment