ఉత్సాహంగా సెపక్‌తక్రా పోటీలు
విజయవాడస్పోర్ట్స్: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌జీఎఫ్‌ఐ) 68వ జాతీయ సెపక్‌తక్రా అండర్–14 బాల, బాలికల టోర్నమెంట్ పటమట జెడ్పీ స్కూల్‌లో అట్టహాసంగా ప్రారంభమైంది. సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్ట్ డైరెక్టర్ బి.శ్రీనివాసరావు క్రీడా జ్యోతి వెలిగించి పోటీలను శుక్రవారం సాయంత్రం ప్రారంభించారు. పలు పాఠశాలల విద్యార్థులు చేసిన సాంస్కృతిక నృత్యాలు ఆకట్టుకున్నాయి. జిల్లాలోని పలు పాఠశాలల కంటెంజెంట్లు నుంచి ముఖ్యఅతిథులు గౌరవ వందనం స్వీకరించారు. ఢిల్లీ, ఉత్తర్‌ప్రదేశ్, జార్ఖండ్, బిహార్, విద్యాభారతి, గుజరాత్, మణిపూర్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పంజాబ్ జట్లు ఈ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి స్కూల్ గేమ్స్ పోటీల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం రూ.7.40 కోట్లను మంజూరు చేసిందని రాష్ట్ర స్కూల్‌గేమ్స్ కార్యదర్శి జి.భానుమూర్తిరాజు ఈ సందర్భంగా వెల్లడించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, పటమట జెడ్పీ స్కూల్ అభివృద్ధి కమిటీ చైర్మన్ యలమంచిలి రవి, డీఈవో సుబ్బారావు, రాష్ట్ర గేమ్స్ రాష్ట్ర సహాయ కార్యదర్శులు రాధాకృష్ణ, రాజు, జాతీయ స్కూల్ గేమ్స్ పరిశీలకులు గౌతమ్, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు జి.ఎస్తేరురాణి, ఎన్టీఆర్ జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, టోర్నీ నిర్వహణ కార్యదర్శి ఎస్.రమేష్, ఎస్‌జీఎఫ్ అండర్–19 ఉమ్మడి కృష్ణాజిల్లా కార్యదర్శి వి.రవికాంత పాల్గొన్నారు.
హోరాహోరీగా పోటీలు
తొలి రోజు లీగ్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. బాలుర విభాగంలో పూల్ డీలోని తమిళనాడు, తెలంగాణ జట్లు తలపడ్డాయి. 3–0 తేడాతో తమిళనాడు గెలిచింది. పూల్ సీలోని మణిపూర్, మహారాష్ట్రకు జరిగిన పోటీలో మణిపూర్ 3–0 తేడాతో గెలిచింది. బాలికల విభాగంలో పూల్ సీ లోని ఢిల్లీ, మహారాష్ట్ర జట్లు తలపడ్డాయి. ఈ పోటీల్లో ఢిల్లీ 2–1 తేడాతో గెలిచింది. పూల్ డీలోని తమిళనాడు, తెలంగాణకు జరిగిన మ్యాచ్‌లో తమిళనాడు 3–0 తేడాతో గెలిచింది.
Comments
Please login to add a commentAdd a comment