భక్తిశ్రద్ధలతో పవళింపు సేవ
మోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామివారి దేవస్థానంలో స్వామి వారి పుష్పశయ్యాలంకృత పర్యంకసేవ నిర్వహించారు. వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు రాత్రి ప్రత్యేక పల్లకీలో స్వామివారిని ద్వాదశ ప్రదక్షిణలు చేశారు. అంతకుముదు ఆలయ డీసీ దాసరి శ్రీరామ వరప్రసాదరావు ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం 5 గంటలకు సుప్రభాతసేవ, ప్రాతఃకాలార్చన, పంచామృత స్నపన, నీరాజన మంత్రపుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రికి భక్తిశ్రద్ధలతో స్వామివార్ల పర్యంక సేవ నిర్వహించారు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు స్వామివార్లను దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు.
దుర్గమ్మ సేవలో మంత్రి జనార్దన్‌రెడ్డి దంపతులు
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి దంపతులు శుక్రవారం దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనానికి విచ్చేసిన మంత్రి జనార్దన్‌రెడ్డికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు, పూలు, పండ్లు అందజేసిన అనంతరం ప్రత్యేక పూజలు జరిపించుకున్నారు. వేద పండితులు ఆశీర్వచనం అందజేయగా, ఆలయ డీఈవో రత్నరాజు మంత్రికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, పట్టువస్త్రాలను అందించారు.
వేంకటేశ్వరుని సన్నిధిలో ప్రముఖులు
తిరుమలగిరి(జగ్గయ్యపేట): స్థానిక వాల్మీకోద్భవ వేంకటేశ్వర స్వామి వారిని శుక్రవారం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. దేవదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ దంపతులు దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ ఈవో వరప్రసాద్ ప్రత్యేక స్వాగతం పలికారు. అనంతరం వేద పండితుల ఆశీర్వచనం, స్వామి వారి చిత్రపటం అందజేశారు. తెలంగాణ రాష్ట్రం బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ దర్శించుకుని పూజలు చేశారు. ఆలయ అధికారులు స్వామివారి చిత్రపటం, ప్రసాదాలు బహూకరించారు. చైర్మన్ భరద్వాజ్, ప్రధానార్చకుడు రామకృష్ణమాచార్యులు, సిబ్బంది పాల్గొన్నారు.
విశాఖ జూ పార్క్‌కు రాబందు
మచిలీపట్నంటౌన్: కృష్ణాజిల్లాకు శివారు గ్రామమైన కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెంలో లభించిన అరుదైన నల్ల రాబందు విశాఖ జూ పార్కుకు చేరింది. కై కలూరు ఫారెస్ట్ డెప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఎం. రంజిత్‌కుమార్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ డి.రాజేష్‌ల ఆధ్వర్యంలో అధికారుల బృందం శుక్రవారం ఉదయం ఈ రాబందును విశాఖపట్నం తీసుకువెళ్లి జూ పార్కు వైద్యుడు పి.భానుబాబుకు అందజేశారు. ఆయన ఈ రాబందును స్వాధీనం చేసుకుని వైద్య పరీక్షలు నిర్వహించారు. రెండేళ్ల వయసు ఉన్న ఈ రాబందు ఆరోగ్యంగా ఉందని 14 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంచుతామని భానుబాబు చెప్పినట్లు రంజిత్‌కుమార్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment