![నేటి](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/07pnm05a-310164_mr-1738981009-0.jpg.webp?itok=kIWf4zZe)
నేటి నుంచి వీరమ్మతల్లి తిరునాళ్ల
ఉయ్యూరు: భక్తుల పాలిట కల్పవల్లిగా పూజలందుకుంటున్న ఉయ్యూరు వీరమ్మతల్లి తిరునాళ్ల శనివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఏటా మాఘశుద్ధ ఏకాదశి (భీష్మ ఏకాదశి) పర్వదినాన ప్రారంభమై 15 రోజులు పాటు తిరునాళ్ల కొనసాగుతుంది. ఈ ఏడాది అమ్మవారు మెట్టి నింటి నుంచి శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఆలయానికి బయలుదేరుతారు. సంప్రదాయం ప్రకారం పోలీసు శాఖ అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పిస్తారు. పారుపూడి, నెరుసు వంశస్తులు పూజా కార్యక్రమాలు జరిపించి ఉత్సవాలకు అంకురార్పణ చేస్తారు. మెట్టినింటి నుంచి కనక చింతయ్య సమేతంగా అమ్మవారు పల్లకీలో ఊరేగింపుగా బయలుదేరటంతో వేలాది మంది భక్తులు ఎదురుగండ దీపాలతో హరతులు పట్టి స్వాగతం పలికి మొక్కులు చెల్లిస్తారు. తిరుగుడు గండ దీప భక్తులు అమ్మవారి పల్లకీ వెంట రేయింబవళ్లు పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవంలో తిరుగుతూ భక్తిపారవశ్యం చెందుతారు. గ్రామోత్సవం పూర్తయిన రెండో రోజు ఊయల ఉత్సవం పూర్తికావటంతో చల్లని తల్లి ఆలయ ప్రవేశం చేసి భక్తుల పూజలందుకుంటారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ప్రభుత్వ శాఖలు ఏర్పాట్లు పర్యవేక్షించాయి.
పకడ్బందీగా నిర్వహించాలి..
తిరునాళ్ల పకడ్బందీగా నిర్వహించాలని కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్.గంగాధర్‌రావు ఆదేశించారు. ఉయ్యూరు పట్టణంలో ఈనెల 8వ తేదీ నుంచి ప్రారంభం కానున్న వీరమ్మతల్లి తిరునాళ్ల ఏర్పాట్లను శుక్రవారం రాత్రి ఆయన పరిశీలించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని సమర్థంగా తిరునాళ్ల సాగేలా చూడాలన్నారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రత కట్టుదిట్టంగా ఉండాలన్నారు. సీఐ రామారావు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
![నేటి నుంచి వీరమ్మతల్లి తిరునాళ్ల 1](https://www.sakshi.com/gallery_images/2025/02/8/07pnm01a-310164_mr-1738981010-1.jpg)
నేటి నుంచి వీరమ్మతల్లి తిరునాళ్ల
Comments
Please login to add a commentAdd a comment