అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పెంచాలి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): జిల్లాలో ఇసుక తవ్వకాలు, స్టాక్ పాయింట్ల ద్వారా సరఫరా ప్రక్రియ సజావుగా సాగేలా చూడాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పెంచాలని కలెక్టర్ సూచించారు. శుక్రవారం కలెక్టర్ లక్ష్మీశ అధ్యక్షతన జిల్లాస్థాయి ఇసుక కమిటీ (డీఎల్‌ఎస్‌ఏ) సమావేశం జరిగింది. ప్రస్తుతం జిల్లాలోని రీచ్‌ల్లో తవ్వకాలకు అందుబాటులో ఉన్న ఇసుక, ఇప్పటి వరకు సరఫరా చేసిన ఇసుక, భవిష్యత్ కార్యకలాపాలు తదితరాలపై సమావేశంలో చర్చించారు. జిల్లాలోని 15 రీచ్‌లలో 11,06,400 మెట్రిక్ టన్నుల ఇసుక తవ్వకాలకు సిద్ధంగా ఉందని మైన్స్ అండ్ జియాలజీ అధికారులు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ జిల్లాలో పర్యావరణ, ఇతర అనుమతుల ఆధారంగా తవ్వకాలు జరిగేలా చూడాలన్నారు. చెక్‌పోస్టుల్లో సీసీ టీవీల సంఖ్యను పెంచాలని.. రెవెన్యూ, పోలీస్, మైన్స్ అండ్ జియాలజీ తదితర శాఖల అధికారులతో జాయింట్ టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. స్టాక్ పాయింట్ల వద్ద కార్యకలాపాలు పగటి సమయంలో మాత్రమే జరిగేలా చూడాలని ఆదేశించారు. ఇసుక తవ్వకాలు, సరఫరా వ్యవస్థలపై ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని కలెక్టర్ లక్ష్మీశ స్పష్టం చేశారు. సమావేశంలో అసిస్టెంట్ కలెక్టర్ శుభం నోఖ్వాల్, మైన్స్ అండ్ జియాలజీ డెప్యూటీ డైరెక్టర్ ఎ.శ్రీనివాస్, ఏడీ వీరాస్వామి, నందిగామ ఆర్‌డీవో కె.బాలకృష్ణ, డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ కేఎం మహేశ్వరరాజు, భూగర్భజల శాఖ డీడీ నాగరాజ, పర్యావరణ ఇంజినీర్ పి.శ్రీనివాస్ పాల్గొన్నారు.
జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ
Comments
Please login to add a commentAdd a comment