మార్కెట్ యార్డుకు మూడు రోజులు సెలవు
కర్నూలు(అగ్రికల్చర్): కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీకి ఈ నెల 11వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సెలవులు ఉన్నందున వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరగవని ఎంపిక శ్రేణి సెక్రటరీ జయలక్ష్మి తెలిపారు. శుక్రవారం మహర్ణవమి, 12న విజయదశమి సెలవులు ఉన్నాయని, 13న ఆదివారం సెలవు దినమని గురువారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 14వ తేదీ నుంచి వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని, రైతులు గమనించాలని కోరారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం
ఆదోనిఅర్బన్: మండలంలోని గోనబావి గ్రామ సమీపంలోని ఆస్పరి రోడ్డులో ఉన్న పెట్రోల్ బంకు వద్ద రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆంజనేయులు (49) అనే వ్యక్తి గురువారం మృతిచెందాడు. తాలూకా పోలీసులు తెలిపిన వివరాలు.. ఆస్పరికి చెందిన ఆంజనేయులు ఆదోని ఇందిరానగర్ కాలనీలో నివాసముంటున్నాడు. గోనబావి గ్రామ సమీపంలోని పెట్రోల్ బంకులో పనిచేస్తున్నారు. గురువారం టీ తాగేందుకు వెళ్తూ రోడ్డు దాటుతుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. స్థానికులు ఆదోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య లలిత, ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
రేషన్ బియ్యం స్వాధీనం
శ్రీశైలం: క్షేత్ర పరిధిలోని టోల్‌గేట్ వద్ద సీఐ ప్రసాద్‌రావు సిబ్బందితో గురువారం తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటోలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీఐ తెలిపిన వివరాలు.. ఆటోలో ఎనిమిది బస్తాల (400 కేజీలు) బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు తనిఖీ పోలీసులు గుర్తించారు. నిందితులు పల్నాడు జిల్లాకు చెందిన ఆవుల నాగరాజు, గొల్ల పాపారావు, తెలంగాణ రాష్ట్రం మున్ననూరుకు చెందిన మూడవత్ మల్లేష్‌ను అదుపులోకి తీసుకుని బియ్యం స్వాధీనం చేసుకుని ఆటోను సీజ్ చేశారు. వన్‌టౌన్ పోలీసులు మహేష్ రఘునాథుడు, నాను నాయక్, శివ మహేందర్‌రెడ్డి, నాగవేణి తదితరుల సహకారంతో నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ తెలిపారు.
సబ్సిడీపై నూలు సరఫరా
కర్నూలు(అగ్రికల్చర్): చేనేత కార్మికులకు రా మెటీరియల్ సప్లై స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం 15 శాతం సబ్సిడీపై నూలు సరఫరా చేయనుందని ఉమ్మడి కర్నూలు జిల్లా చేనేత, జౌళి శాఖ సహాయ సంచాలకులు నాగరాజరావు తెలిపారు. చేనేత కార్మికులు, సొసైటీల్లో సభ్యులుగా ఉన్న చేనేతకారులకు, చేనేతకారులు సభ్యులుగా ఉన్న స్వయం సహాయక సంఘాలు, జాయింట్ లయబులిటీ గ్రూపులు(జేఎల్‌జీ), మాస్టర్ వీవర్‌లకు కూడా సబ్సిడీ లభిస్తుందని పేర్కొన్నారు. సబ్సిడీని నేరుగా చేనేతకారుల బ్యాంకు ఖాతాలకు డీబీటీ ద్వారా విడుదల చేయడం జరుగుతుందని వివరించారు. ఈ అవకాశాన్ని చేనేతకారు లు సద్వినియోగం చేసుకోవాలని సూచించా రు. మరిన్ని వివరాలకు జిల్లా చేనేత, జౌళి శాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment