గుర్రాల పారువేటకు వేళాయె
మద్దికెర: విజయదశమి రోజున సాంప్రదాయ పోటీకి రంగం సిద్ధమైంది. మద్దికెరలో 3 శతాబ్దాలుగా దసరా పండుగ పురస్కరించుకుని అశ్వాల పారువేట అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ ఉత్సవాన్ని చూసేందుకు వేలల్లో ప్రజలు తరలివస్తారు. దసరా రోజు యాదవ రాజవంశీకులు గుర్రాలపై స్వారీ చేయడం ప్రత్యేకం. మద్దికెరలో పెద్దనగరి, చిన్న నగరి, యామనగరి అనే మూడు కుటుంబాల వారు దసరా వేడుకలు నిర్వహిస్తారు. ఈ నెల 12న ఉత్సవాలు వైభవంగా నిర్వహించేందుకు సిద్ధం చేస్తున్నారు. ఒక్కో కుటుంబం నుంచి రెండు లేక మూడు గుర్రాలను స్వారీకి పంపుతారు. గుర్రాలకు నెలరోజుల పాటు శిక్షణ ఇస్తారు. మండల కేంద్రానికి 3 కి.మీ దూరంలో ఉన్న బొజ్జనాయుని పేట భోగేశ్వరాలయం నుంచి మద్దికెర వరకు రోజూ స్వారీ చేస్తారు.
విజయం సాధిస్తే ఆనందం.
పాలెగాళ్లుగా పేరుగాంచిన ఈ కుటుంబీకులు తమ పూర్వీకుల నుంచి వస్తున్న ఆచార సాంప్రదాయాలను నేటికీ కొనసాగిస్తున్నారు. అందులో గుర్రాల పారువేట ఒకటి. యాదవ రాజవంశీకులు దసరా రోజున గుర్రాలపై కూర్చొని తలపాగా ధరించి రాచరిక వస్త్రధారణలో ఖడ్గం చేతబట్టి మేళ తాళాలతో మద్దికెరకు 3 కి.మీ దూరంలో నాటి యాదవరాజులు నిర్మించిన బొజ్జనాయినిపేట గ్రామంలోని భోగేశ్వర ఆలయానికి వెళ్లి పూజలు నిర్వహిస్తారు. అశ్వరోహుల వెంట ‘మద్ది’ కులస్తులు సైన్యంలాగా ఆయుధాలు ధరించి వెళతారు. అక్కడి నుంచి పోటీ ప్రారంభించి గుర్రపు స్వారీ చేస్తూ మద్దికెరకు చేరుకుంటారు. విజయం సాధించిన వారిని గ్రామంలో మొదటగా ఊరేగిస్తారు. ఈ వేడుకలు ఏటా చూపరులకు కనువిందు చేస్తూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment