కొనుగోలు కేంద్రాలు మరింత జాప్యం
సీసీఐ బేలచూపులు
పత్తికి మద్దతు ధర ఒట్టిమాట
ఉమ్మడి జిల్లాలో 2.70 లక్షల ఎకరాల్లో సాగు
ప్రతిపాదనలకే పరిమితమైన కొనుగోలు కేంద్రాలు
మిల్లర్ల సిండికేట్ మాయాజాలం
దళారులతో కలసి రైతులను దోచుకుంటున్న వైనం
ఎమ్మిగనూరు/కర్నూలు(అగ్రికల్చర్): పత్తి దిగుబడులు చేతికందుతున్నా మద్దతు ధర ఊసే లేదు.. కొనుగోలు కేంద్రాల జాడే లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వంలో రైతు సంక్షేమం కేవలం ప్రకటనలకే పరిమితమని తేటతెల్లమవుతోంది. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పత్తి తీత పనులు ఊపందుకున్నా అధికారులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారీలు చెలరేగిపోతున్నారు. పత్తి క్రయ, విక్రయాలకు ఆదోని వ్యవసాయ మార్కెట్ యార్డు మాత్రమే ఏకై క ఆధారం. మార్కెట్‌లో వ్యాపారులు సిండికేట్ కావడంతో ధరల్లో పురోగతి అనేది లేదు. ధరలు లభించనపుడు ప్రభుత్వం చొరవ తీసుకొని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను రంగంలోకి దించాల్సిన అవసరం ఉంది. 20 రోజులుగా అధికారులు అదిగో.. ఇదిగో కొనుగోలు కేంద్రాలంటూ.. హడావుడి చేస్తున్నప్పటికీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు. ఈ పరిస్థితుల్లో దళారులు చెప్పిందే రేటు.. మిల్లర్లు బోర్డుపై రాసిందే ధరే శాసనం అన్నట్లుగా ఉంది. కొనుగోళ్ల విషయంలో వ్యాపారులు, దళారులదే పైచేయిలా కనిపిస్తోంది. ఈసారి తెల్లబంగారం దిగుబడులు ఆశాజనకంగా ఉన్నా మద్దతు ధర అందక పోవంతో రైతు తెల్లమొహం వేస్తున్నాడు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో 2.70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేశారు. ఈ ఏడాది 3.2 లక్షల మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చని అధికారుల అంచనా. ఒక్క కర్నూలు జిల్లాలోనే 2 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కావడం విశేషం. గతంతో పోలిస్తే ఈ ఏడాది తుపాన్ల ప్రభావంతో వర్షాలు విస్తారంగా కురుస్తుండటం, చీడ–పీడల బెడద తక్కువగా ఉండటంతో దిగుబడులు గణనీయంగా వస్తున్నాయి. ఎకరాకు 12 నుంచి 15 క్వింటాళ్ల వరకు వస్తోంది. అయితే మద్దతు ధరలు లేక నష్టపోతున్నారు. ఈనెల 1వ తేదీ నుంచి పత్తి మద్దతు ధరను కేంద్రం ప్రకటించింది. సీసీఐ 2024–25 సంవత్సరానికి గాను పత్తికి మద్దతు ధరలు నిర్ణయించింది. పొడుగు పింజ రకం క్వింటం రూ.7,521, పొట్టిపింజ రకం రూ.7,121లుగా నిర్ణయించింది. అయితే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారుల చేతిలో రైతులు నష్టపోతున్నారు.
త్వరలో కొనుగోలు
కేంద్రాలు ఏర్పాటు చేస్తాం
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా త్వరలోనే పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. ఇప్పటికే జిల్లాలోని ఆదోని, మంత్రాలయం, ఎమ్మిగనూరు, పెంచికలపాడుల్లో కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు జిన్నింగ్ మిల్లులను గుర్తించాం. ఒకటి, రెండు రోజుల్లో సీసీఐ అనుమతి లభించే అవకాశం ఉంది. రైతులు మద్దతు ధరతో అమ్ముకునేందుకు ఆర్‌ఎస్‌కేల్లో రిజిస్ట్రేషన్‌లకు అవకాశం కల్పిస్తాం. – నారాయణమూర్తి,
సహాయ సంచాలకులు, మార్కెటింగ్ శాఖ
మద్దతు ధర కంటే మార్కెట్‌లో ధర పడిపోయినప్పడు రైతులు నష్ట పోకుండా ప్రభుత్వం సీసీఐ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి ఆదుకోవాలి. ప్రస్తుతం క్వింటం రూ. 7,000 వరకు మాత్రమే ధర లభిస్తోంది. ధరలు పడిపోయి రైతులు నష్టపోతున్నా మార్కెటింగ్ శాఖ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇప్పటి వరకు ఒక్క కొనుగోలు కేంద్రం కూడా అందుబాటులోకి రాలేదు. మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు సెంటరు వారీగా జిన్నింగ్ మిల్లులను గుర్తించి సీసీఐకి పంపినప్పటికీ స్పందన లేకుండా పోయింది. ఆదోనిలో ఐదు, ఎమ్మిగనూరులో 4, మంత్రాలయంలో 2, పెంచికలపాడులో ఒకటి ప్రకారం మొత్తం 12 జిన్నింగ్ మిల్లుల్లో మద్దతు ధరతో కొనుగోలు చేసేందుకు నాలుగు రోజుల క్రితం ఆమోదం తెలిపారు. అయితే వాటిని సీసీఐ కూడా ఆమోదించాల్సి ఉంది. ఆ తర్వాతనే రైతులు రైతు సేవా కేంద్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ మొదలయ్యేందుకు మరింత జాప్యమయ్యే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment