ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్రబ్యాంకు ప్రధాన కార్యాలయం
తిరోగమనంలో ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్రబ్యాంకు
టర్నోవర్ లక్ష్యం తగ్గుతున్న వైనం
బడ్జెట్ భారీగా ఉన్నా..రుణాల పంపిణీ నామమాత్రమే
రూ.330 కోట్లు విడుదలైనా పంపిణీ రూ. 2 కోట్లే
ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు (కేడీసీసీబీ) మళ్లీ నష్టాలవైపు చూస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత సేవలు పడకేశాయి. 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటికే 7 నెలలు గడిచిపోయాయి. నిధులకు ఎలాంటి కొరత లేకపోయినప్పటికీ రైతులకు రుణాలు పంపిణీలో ఎప్పుడూ లేని విధంగా బ్యాంకు వెనకబడిపోయింది.
కర్నూలు(అగ్రికల్చర్): రైతులకు సకాలంలో రుణాలు అందించి అండగా నిలవాల్సిన కేడీసీసీబీలో నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో దశాబ్దాల నాటి నష్టాలను అధిగమించి లాభాల బాట పట్టిన బ్యాంకు నేడు మళ్లీ నష్టాల వైపు చూస్తోంది. 2024–25 ఆర్ధిక సంవత్సరంలో రుణాల పంపిణీ కోసం ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్రబ్యాంకు బ్రాంచీలకు, పీఏసీఎస్‌లకు దీర్ఘ, స్వల్పకాలిక రుణాల పంపిణీ కోసం రూ.330 కోట్లు విడుదల చేసింది. ఈ బడ్జెట్ పూర్తి అయితే అదనంగా నిధులు మంజూరయ్యే అవకాశం ఉంది. బడ్జెట్ భారీగా ఉన్నప్పటికీ రుణాల పంపిణీ మాత్రం తూతూ మంత్రమంగానే సాగుతోంది. ఓ వైపు వాణిజ్య బ్యాంకుల్లో రుణాల కోసం రైతులు, ఇతర అన్ని వర్గాల ప్రజలు పోటెత్తుతున్నారు. రుణాల కోసం వచ్చే వారితో ఆ బ్యాంకులు కిటకిటలాడుతుంటాయి. జిల్లా సహకార కేంద్రబ్యాంకు బ్రాంచ్‌ల్లో మాత్రం అందుకు విరుద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. ఏటా జూలై నుంచి డిసెంబరు మూడవ వారం వరకే రుణాలు పంపిణీ చేస్తారు. ఆ తర్వాత రికవరీపై దృష్టి సారిస్తారు. రుణాల పంపిణీ కోసం రూ.330 కోట్ల బడ్జెట్ అన్ని బ్రాంచ్‌లకు, అన్ని పీఏసీఎస్‌లకు కేటాయించినప్పటికీ ఇప్పటి వరకు రుణాల పంపిణీ రూ.2 కోట్లలోపే ఉండటం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరం 7 నెలలు ముగిసిపోయాయి. ఇక ఐదు నెలల్లో లక్ష్యాన్ని ఎలా చేరుకుంటారో బ్యాంక్ అధికారులకే తెలియాలి. ఇంతటి దారుణమైన పరిస్థితి ఎప్పుడూ లేదని బ్యాంకు వర్గాలే స్పష్టం చేస్తున్నాయి. బ్యాంకు అంటే రుణాల పంపిణీ, రికవరీలే ప్రధానం. కేడీసీసీబీలో మాత్రమే రుణాల పంపిణీ, రికవరీ సైతం లేక ఎన్‌పీఏ కొండలా పెరిగిపోతోంది.
కొనసాగు..తున్న కంప్యూటరీకరణ
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కర్నూలు జిల్లాలో 43, నంద్యాల జిల్లాలో 56 ఉన్నాయి. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే పీఏసీఎస్‌ల్లో కంప్యూటరీకరణ పూర్తి చేసి పారదర్శకంగా లావాదేవీలు నిర్వహించడానికి చర్యలు చేపట్టింది. 90 శాతం పీఏసీఎస్‌ల్లో అవినీతి, అక్రమాలు రాజ్యమేలు తున్నాయి. అక్రమాలకు చెక్ పెట్టేందుకే గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కంప్యూటరీకరణకు శ్రీకారం చుట్టింది. కంప్యూటరీకరణలో భాగంగా 2023–24లోనే ఫస్ట్‌హ్యాండ్ రిపోర్టు, ఫీల్డ్ వెరిఫికేషన్ రిపోర్టు పూర్తి అయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి డేటా క్యాప్చరింగ్ టూల్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో పీఏసీఎస్‌ల్లో సభ్యులైన బారొయింగ్స్ (రుణాలు పొందిన వారు), నాన్ బారోయింగ్స్ (షేర్ ధనం మాత్రం చెల్లించి రుణాలు పొందని వారు) వివరాలు, వారి భూముల వివరాలు, డిపాజిట్లు, అప్పుల వివరాలు సమగ్రంగా నమోదు చేయాలి. ఈ ప్రక్రియ ఫిబ్రవరి నుంచి కొనసాగుతూనే ఉంది. పీసీసీఎస్‌ల సిబ్బంది కంప్యూటరీకరణ అంటూ రుణాల పంపిణీని పూర్తిగా పక్కన పెట్టేశారు. కానీ ఇటు కంప్యూటరీకరణలో ప్రగతి లేదు... రుణాల పంపిణీ లేకుండా పోయింది.
నాడు రూ.10 కోట్ల లాభం..
నష్టాల ఊబిలో చిక్కుకున్న డీసీసీబీకి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఊపిరిపోసింది. వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు కేడీసీసీబీ రుణాలు పంపిణీ చేసే ఏర్పాటు చేసింది. కస్టమ్స్‌హయ్యరింగ్ సెంటర్లు, మల్టీపర్పస్ గోదాముల నిర్మాణాలకు డీసీసీబీ రుణాలు అందజేసింది. గత ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల ఫలితంగా బ్యాంకు లోనింగ్ భారీగా పెరిగింది. ఆ సమయంలో దశాబ్దాల నాటి నష్టాలను అధిగమించి నికర లాభాల్లోకి వచ్చింది. ఏకంగా రూ.10 కోట్లు లాభం ఆర్జించగా.. సభ్యులైన పీఏసీఎస్‌లకు రూ.4 కోట్లు డివిడెంట్ ఇచ్చింది. దీంతో కేడీసీసీబీ నికర లాభాల్లోకి వచ్చింది. రాయలసీమ జిల్లాల్లోనే అత్యధిక టర్నోవర్ కలిగిన బ్యాంకుగా వరుసగా రెండేళ్లు అవార్డు కూడా అందుకుంది. నికర లాభాల్లోకి వచ్చిన కేడీసీసీబీ మళ్లీ నష్టాల్లోకి వస్తుండటంతో ఆందోళన కలిగిస్తోంది.
పెరుగుతున్న అవినీతి అక్రమాలు...
కింది స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ప్రతి ఒక్కరూ జవాబుదారితనంతో పనిచేస్తేనే బ్యాంకు ప్రగతి పథంలోకి వస్తుంది. కాని జవాబుదారితనం లేకపోగా.. ఎవ్వరికి వారు జేబులు నింపుకోవడానికి ప్రాధాన్యత ఇస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. బ్యాంకును ఉపయోగించి ఏ విధంగా సంపాదించుకోవచ్చనే దానిపై ఎక్కువ మందికి దృష్టి సారించినట్లు తెలుస్తోంది. చేయితడవనిదే ఏ పని చేయని వారు డీసీసీబీల్లో కోకొల్లలుగా ఉన్నారనే విమర్శలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత టీడీపీ నేతల అండదండలతో అక్రమార్జనకు పాల్పడేందుకు అనేక మంది ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఓ కీలకపోస్టులో ఉన్న అధికారి తాను, తన కుటుంబసభ్యులు ముఖ్యస్థానాల్లో ఉండి సంపాదించుకోవడానికి పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది.
రూ.4,600 కోట్ల టర్నోవర్ లక్ష్యం చేరుకునేదెట్లా?
2023–24 ఆర్ధిక సంవత్సరం ముగిసే సమయానికి జిల్లా సహకార కేంద్ర బ్యాంకు రూ.4,000 కోట్ల టర్నోవర్ దాటింది. 2024–25లో రూ.4,600 కోట్ల టర్నోవర్‌ను అధిగమించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఈ ఏడాది లక్ష్యాన్ని సాధించడం ఏమిటో కానీ.. 2023–24 టర్నోవర్‌ను నిలబెట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. గత ఏడాదితో పోలిస్తే ఇప్పటికే రూ.100 కోట్ల వరకు టర్నోవర్ తగ్గినట్లు తెలుస్తోంది. కొత్త రుణాలపంపిణీ లేకపోగా.. బకాయిలు పేరుకపోయి అవి నిరర్ధక ఆస్తులుగా మారుతున్నాయి. కూటమి ప్రభుత్వంలో బ్యాంకు పరువు బజారున పడినట్లు అయింది. ఉమ్మడి కర్నూలు జిల్లా సహకార కేంద్రబ్యాంకు బాగోగులను పాలకులు పట్టించుకోకపోగా... బ్యాంకు ద్వారా ఏ విధంగా తమ వారిని ఆర్థికంగా బాగు చేసుకోవచ్చనే దానిపైనే దృష్టి సారించడం గమనార్హం. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన ఏజెన్సీ తమ అనుచరులకు ఇప్పించుకునేందుకు ఉమ్మడి జిల్లాలోని ఇద్దరు మంత్రులు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. దీంతో బ్యాంకు అధికారులకు దిక్కుతోచని పరిస్థితి ఎదురవుతోంది. బ్యాంకు అభివృద్ధిని మాత్రం పట్టించుకోవడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment