అనర్హత పేరుతో తొలగింపునకు కసరత్తు
అనర్హత పేరుతో తొలగింపునకు కసరత్తు
50 రోజుల ప్రణాళికతో రంగం సిద్ధం
ఉమ్మడి జిల్లాలో కోత టార్గెట్.. లక్ష పింఛన్లు
మితిమీరనున్న తెలుగు తమ్ముళ్ల జోక్యం
లబ్ధిదారుల్లో మొదలైన ఆందోళన
ప్రజలను వంచించడంలో నారా చంద్రబాబు ముందు వరుసలో ఉంటారనేది మరో సారి రుజువవుతోంది. ఎన్నికల హామీలను విస్మరిస్తూనే సంక్షేమ పథకాల్లో కోతకు పదును పెట్టారు. పింఛన్ పెంపు అంటూనే వెనుక నుంచి తొలగింపునకు ‘పచ్చ’ జెండా ఊపారు.
ఓ వైపు దరఖాస్తులు తీసుకుంటామంటూ మరో వైపు వేటుకు కూడా రంగం సిద్ధం చేశారు. అనర్హత పేరుతో అత్యధికంగా తొలగించాలని ఆదేశించడం, ఈ క్రమంలోనే మరో సారి జన్మభూమి కమిటీలు ఏర్పాటవుతాయనే చర్చ జరుగుతుండటంతో తమ పింఛన్ ఉంటుందా.. పోతుందా అని ఆందోళన లబ్ధిదారుల్లో మొదలైంది.
కర్నూలు(అగ్రికల్చర్): 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు వృద్ధాప్య పింఛన్ ఇస్తామంటూ కూటమి నేతలు హామీలు గుప్పించారు. ఇంట్లో 50 ఏళ్ల వారు ఎంత మంది ఉంటే అందరికీ పింఛన్.. అంటూ ఊరించారు. అధికారం చేపట్టి దాదాపు 5 నెలలు అవుతోంది. కొత్త పింఛన్లు దేవుడెరుగు.. ఉన్న వాటిని తొలగించేందుకు సిద్ధమవుతుండంతో అవ్వాతాతలు, వితంతువులు, వికలాంగులు, చేనేత కారులు తదితర పింఛన్‌దారుల గుండెల్లో గుబులు మొదలైంది. పింఛన్ పోతే తమ పరిస్థితి ఏమిటనీ, ఎవ్వరు పట్టించుకుంటారనే భయం వారిలో వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఉన్న పింఛన్లను అడ్డుగోలుగా తొలగించేందుకు కసరత్తు మొదలైంది. ఇందు కోసం 50 రోజుల ప్రణాళికను ప్రభుత్వం సిద్ధం చేసింది.
నవంబరు నెలలో ఓ వైపు కొత్త పింఛన్లకు దరఖాస్తులు స్వీకరించడంతో పాటు ఉన్న పింఛన్లలో అనర్హులను గుర్తించేందుకు తనిఖీలు కూడా చేపట్టనున్నారు. అనర్హత పేరుతో అత్యధికంగా పింఛన్లను కోత కోసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. పది కాదు.. వంద కాదు... ఏకంగా వేలల్లో తొలగించేందుకు చర్యలు చేపట్టింది. అక్టోబరు నెలలో కర్నూలు జిల్లాలో 2,41,843, నంద్యాల జిల్లాలో 2,18,223 పింఛన్‌లు ఉన్నాయి. ఒక్కో జిల్లాలో 50 వేలకు తగ్గకుండా అంటే ఉమ్మడి జిల్లాలో లక్ష పింఛన్‌లను తొలగించనున్నట్లు తెలుస్తోంది.
ఈ మేరకు తొలగింపులపై సెర్ప్ మౌఖికంగా ఆదేశాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే అనర్హత సాకుతో అర్హుల పింఛన్లపై కూడా వేటు వేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. వైఎస్సార్‌సీపీ పాలనలో అర్హతనే ప్రమాణికంగా తీసుకొని ఏడాదికి రెండుసార్లు పింఛన్‌లు మంజూరు చేస్తూ వచ్చింది. గత టీడీపీ ప్రభుత్వంలో రూపొందించిన మార్గదర్శకాల ప్రకారమే (సిక్స్‌స్టెప్స్ వాల్యుడేషన్) పింఛన్‌లు మంజూరు చేసింది. అయితే వైఎస్సార్‌సీపీ పాలనలో అనర్హులకు ఇచ్చారని, తొలగింపునకు సిద్ధంగా ఉండాలని ఓ పథకం ప్రకారం ప్రభుత్వం సంకేతాలు ఇస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లాలో 6,321 పింఛన్లను కోత కోశారు. కర్నూలు జిల్లాలో 3,844, నంద్యాల జిల్లాలో 2,477 పింఛన్లు తొలగించారు.
అర్హతకే పాతర..
పింఛన్ లబ్ధిదారులను నిర్ణయించడంలో టీడీపీ నేతలు కీలకం కానుండటంతో లబ్ధిదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పింఛన్ల తొలగింపునకు నియోజక వర్గాల వారీగా టీడీపీ నేతల చేతికి జాబితా సిద్ధం అందినట్లు తెలుస్తోంది. వైఎస్సార్‌సీపీ ముద్ర వేసి అనర్హత వేటు వేయించాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలుస్తోంది. టీడీపీ నేతలు ఇచ్చే జాబితాల్లోని ఉన్న వారికి నోటీసులు ఇచ్చి ఆ తర్వాత తొలగించడానికి అధికారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తెలుగు తమ్ముళ్ల సిపారస్సులు ఉన్న వారికే కొత్త పింఛన్లు ఇస్తారని ప్రచారం జరుగుతోంది. జనవరి నెల నుంచి మళ్లీ జన్మభూమి–2 కార్యక్రమం చేపడుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించడంతో జన్మభూమి కమిటీలు కూడా రాబోతున్నాయని గ్రామాల్లో టీడీపీ నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. జన్మభూమి కమిటీలు ముడుపులు ఇచ్చిన వారికి, అనర్హులకే సంక్షేమ పథకాలు మంజూరవుతాయనేది అందిరికీ తెలిసిందే.
అక్టోబరు నెలలో ఉమ్మడి జిల్లాలోని పింఛన్ల వివరాలు
పింఛన్‌లు, కర్నూలు, నంద్యాల
వృద్ధ్దాప్య 1,23,058 1,11,289
వితంతు 71,184 62,370
వికలాంగులు 31,209 25,851
చేనేత 2,909 875
కల్లుగీత 236 226
హిజ్రాలు 243 240
ఒంటరి మహిళ 5,852 4265
మత్స్యకారులు 810 1792
సీకేడీయూ (ప్రభుత్వం ఆసుపత్రులు) 130 101
సీకేడీయూ (ప్రైవేటు హాస్పిటళ్లు) 294 173
డప్పు కళాకారులు 1,435 2,883
చర్మకారులు 1,133 2,405
డీఎంహెచ్‌ఓ 784 1,264
కళాకారులు 36 21
సైనిక్ వెల్ఫేర్ 06 05
అభయహస్తం 2,524 4,365
మొత్తం 2,41,843 2,18,225
Comments
Please login to add a commentAdd a comment