మందులకు కటకట | - | Sakshi
Sakshi News home page

మందులకు కటకట

Published Wed, Dec 11 2024 1:46 AM | Last Updated on Wed, Dec 11 2024 1:42 PM

పెద్దాసుపత్రిలోని మందులు కొనుగోలు చేస్తున్న దృశ్యం

పెద్దాసుపత్రిలోని మందులు కొనుగోలు చేస్తున్న దృశ్యం

ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత

ఇన్సూలిన్‌, యాంటీబయాటిక్స్‌, బీపీ మందులు బయటికే

మొక్కుబడిగా మందులు ఇస్తున్న వైద్యులు

కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోనూ దయనీయ స్థితి

మందుల బడ్జెట్‌ తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం

20 శాతం బడ్జెట్‌ మందుల నిలుపుదలతో పరిస్థితి అగమ్యగోచరం

స్థానికంగా కొనుగోలు చేసేందుకు అధికారుల చర్యలు

సర్కారు ఆస్పత్రులకు వచ్చేది పేదలు. ఈ విషయం తెలిసి కూడా కూటమి ప్రభుత్వం వాటి నిర్వహణను గాలికి వదిలేసింది. దీంతో ఎక్కడ చూసినా ప్రభుత్వాసుపత్రుల్లో మందులు నిండుకున్నాయి. ఈ కారణంగా రోగులు అధిక శాతం మందులను ప్రైవేటు మెడికల్‌ షాపుల్లో కొనుగోలు చేయాల్సిన దుస్థిత నెలకొంది.

కర్నూలు(హాస్పిటల్‌): జిల్లాలో కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలతో పాటు ఆదోని ఏరియా ఆసుపత్రి, ఎమ్మిగనూరు ఏరియా ఆసుపత్రి, ఐదు సీహెచ్‌సీలు, 35 పీహెచ్‌సీలు, 26 అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, 400లకు పైగా విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు ఉన్నాయి. వీటన్నింటికీ రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌ ద్వారా మందులు పంపిణీ చేస్తుంది. ఏపీఎంఎస్‌ఐడీసీ ద్వారా మందులు కొనుగోలు చేసి జిల్లా కేంద్రాలకు పంపి, అక్కడ నుంచి ఆసుపత్రులకు సరఫరా చేస్తుంది. ప్రతి మూడు నెలలకోసారి ఆయా ఆసుపత్రులు పెట్టిన ఇండెంట్‌ మేరకు మందులు సరఫరా అవుతుంటాయి. ఏప్రిల్‌, జూన్‌, సెప్టెంబర్‌, జనవరిలను క్వార్టర్‌లుగా విభజించారు. ఇందులో మూడవ క్వార్టర్‌ మందులు ఇప్పటి వరకు ఆయా ఆసుపత్రులకు చేరలేదు. కొత్త ప్రభుత్వం వచ్చాక ఒక క్వార్టర్‌ మందులు మాత్రమే అరకొరగా వచ్చాయి. గత ప్రభుత్వం కొనుగోలు చేసిన మందులు అదనంగా ఉండటంతో రెండో క్వార్టర్‌కు ఇబ్బంది లేకుండా పోయింది. ఇప్పుడు అన్ని చోట్లా మందులు నిండుకున్నాయి. దీంతో ఆసుపత్రికి వచ్చిన రోగులకు వ్యాధి నిర్ధారణ పరీక్షలు, వైద్యచికిత్స మినహా మందులు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది.

పెద్దాసుపత్రిలో పరిస్థితి ఇదీ...

కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు ప్రతి క్వార్టర్‌కు రాష్ట్ర ప్రభుత్వం రూ.2.60కోట్ల మందులను సరఫరా చేస్తుంది. ఏడాదికి రూ.10.40కోట్ల మందులు ఇవ్వాలి. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండో క్వార్టర్‌ సమయానికి గతంలో ఉన్న మందులు స్టోర్‌లో నిల్వ ఉన్నాయి కాబట్టి పెద్దగా ఇబ్బంది లేకుండా పోయింది. మూడో క్వార్టర్‌ సమయానికి మాత్రం ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. ఇదే సమయంలో ఆసుపత్రులకు 20 శాతం బడ్జెట్‌లో భాగంగా సరఫరా అయ్యే విధానాన్ని ప్రభుత్వం రద్దు చేసింది. నెలరోజుల నుంచి దీని స్థానంలో నిధులు ఇవ్వలేదు. మందులు సరఫరా చేయలేదు. దీంతో కీలకమైన మందుల కొరత వేధించింది. మరోవైపు ఆసుపత్రిలో నిధుల లేమి వెంటాడుతోంది. ఇప్పుడు మూడో క్వార్టర్‌కు కూడా రెగ్యులర్‌గా ఇచ్చే రూ.2.60 కోట్లకు బదులు రూ. 2.20 కోట్ల బడ్జెట్‌ మాత్రమే కే టాయించింది. ఈ ఆసుపత్రికి ఏటా రోగుల సంఖ్య పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మందులు బడ్జెట్‌ పెంచాల్సింది పోయి తగ్గించడంపై వైద్యవర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

అందుబాటులో లేని మందులు ఇవే...

ప్రభుత్వ ఆసుపత్రుల్లో ముఖ్యంగా షుగర్‌ రోగులకు ఇచ్చే ఇన్సూలిన్‌ నిల్వలు అయిపోయాయి. ముఖ్యంగా సెంట్రల్‌ డ్రగ్‌ స్టోర్‌లోనే రెండు నెలలుగా ఆ మందుల నిల్వలు జీరోగా చూపిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ ఆసుపత్రులకు ఇన్సూలిన్‌లను సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. దీనికితోడు అమాక్సిలిన్‌ మినహా ముఖ్యమైన యాంటిబయాటిక్స్‌ మందులు, ఇంజెక్షన్లు కొరతగా ఉన్నాయి. కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని అత్యవసర విభాగంలో పెప్లాస్‌, మెరోపీనమ్‌, థయామైన్‌, టాక్సిమ్‌, ఈడీటీఏ వాక్యుటిన్స్‌, నాన్‌ ఈడీటీఏ వాక్యుటీన్స్‌ ఇంజెక్షన్లు, ఫోలిక్‌ క్యాథటర్స్‌ అస్సలే లేవు. జైలోకెన్‌, పాంటాప్‌, పారాసిటమాల్‌, సుటుప్యాక్‌, మెట్రోజిల్‌ ఇంజెక్షన్లు తక్కువ పరిమాణంలో ఉంచారు. అలాగే ఓపీలో పారాసిటమాల్‌, మెట్రోజిల్‌, డైక్లోఫెనాక్‌, మెట్రోజిల్‌ వంటి మాత్రలు మినహా ఇతర మందులు ఏవీ ఇవ్వడం లేదు. ఇన్సూలిన్‌ను స్థానికంగా కొనుగోలు చేసి రోగులకు పరిమిత సంఖ్యలో నెలకు ఒకటి, రెండు చొప్పున పంపిణీ చేస్తున్నారు. ముఖ్యంగా ఇమ్యునోగ్లోబ్లిన్స్‌ ఇంజెక్షన్ల కొరత తీవ్రంగా ఉంది. ఖరీదైన ఈ ఇంజెక్షన్లు కొనలేక రోగులు ఇబ్బందులు పడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement