రైతుకు అండగా పోరుబాట
కర్నూలు (టౌన్): ‘ఆరు నెలలు వేచి చూశాం. ఎన్నికల హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయలేదు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామాల్లో ఆర్‌బీకేలు లేవు. పంటకు గిట్టుబాటు ధర లేదు. అధికారం కోసం నమ్మించి మోసం చేసిన కూటమి ప్రభుత్వంపై ఉద్యమించనున్న’ట్లు ఆపార్టీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లో వైఎస్సార్‌సీపీ నాయకులతో కలిసి రైతులకు అండగా వైఎస్సార్‌సీపీ పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులను కూటమి ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు. పండించిన పంటలకు మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు భరోసా కేంద్రాలను కూటమి సర్కారు నిర్వీర్యం చేసిందని మండిపడ్డారు. గతంలో అన్ని రకాల సేవలు ఆర్‌బీకేల్లో అందేవన్నారు. ఏటా రూ. 13,500 చొప్పున పెట్టుబడి సాయం రైతులకు వైఎస్ జగన్ సర్కారు ఇచ్చేదని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అంత కన్నా ఎక్కువగా రూ.20 వేలు ఇస్తామని ఎన్నికల్లో ప్రకటించి ఇప్పటి వరకు నయాపైసా ఇవ్వలేదని చెప్పారు. నాడు తమ అధినేత ఉచిత పంట బీమా అమలు చేసి రైతులను ఆదుకుంటే నేడు చంద్రబాబు ఆ పథకానికి ఏకంగా ఎసరు పెట్టారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, ఈ సమయంలో వారికి అండగా నిలబడేందుకు కూటమి సర్కారుపై వైఎస్సార్‌సీపీ పోరుబాటకు సిద్ధమైందని తెలిపారు. ఈనెల 13వ తేదీ పార్టీ ఆధ్వర్యంలో రైతులతో కలిసి కర్నూలు ధర్నా చౌక్ నుంచి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తర్వాత జిల్లా కలెక్టర్ రంజిత్‌బాషాను కలిసి రైతు సమస్యలపై వినతి పత్రం అందజేస్తామన్నారు. రైతు వ్యతిరేకిగా మారిన కూటమి సర్కారు మెడలు వంచేందుకు చేపడుతున్న ర్యాలీలో గ్రామ, మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయిలో రైతులు, ప్రజలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వైఎస్సార్‌సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు.
టమాట రైతులు రోడ్డున పడ్డారు
ఆరునెలలైనా కూటమి సర్కారు
ఎన్నికల హామీలు అమలు చేయలేదు
13 న అన్నదాతలకు అండగా
వైఎస్సార్‌సీపీ ర్యాలీ
పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర
కల్పించలేదు
పార్టీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి, నాయకులు
కంగాటీ శ్రీదేవి, మేయర్ బీవై రామయ్య
కూటమి ప్రభుత్వ పాలనలో రైతులు నష్టాలు మూటగట్టుకుంటున్నారని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు కర్షకులకు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక మోసం చేశారన్నారు. పత్తికొండలో టమాట రైతులు రోడ్డున పడ్డారన్నారు. కష్టపడి పండించిన పంటను కిలో రూ.1 అడుగుతున్నారన్నారు. వారికి అండగా నిలబడటంలో సర్కారు ఘోరంగా విఫలమైందన్నారు. కర్నూలు మేయర్ బీవై రామయ్య మాట్లాడుతూ చెప్పింది చేయడం జగనన్న నైజం అయితే, చెప్పినదేది అమలు చేయని నైజం చంద్రబాబుది అన్నారు. ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకొని కూటమి సర్కారు లక్షల ఉద్యోగాలు ఇచ్చామని అబద్దాలు చెప్పడం తప్పా.. ఒక్క మేలు చేయలేదన్నారు. ఇప్పటి వరకు డీఎస్సీ నోటిఫికేషన్ లేదు..నిరుద్యోగ భృతి లేదన్నారు. పార్టీ కోడుమూరు ఇన్‌చార్జ్ ఆదిమూలపు సతీష్, వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మద్దూరు సుభాష్ చంద్రబోస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని విమర్శించారు. ఇటీవల కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం ప్రాంతాల్లో రైతులు, ప్రజలు వలసలు వెళ్లేందుకు ప్రభుత్వ పాలన తీరే కారణమన్నారు. అన్నివర్గాల ప్రజలను ఏకం చేసి సర్కారుపై పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో కర్నూలు నగర పాలక స్టాండింగ్ కమిటీ సభ్యులు, కార్పొరేటర్లు విక్రమసింహారెడ్డి, జుబేర్, షేక్ యూనుసు బాషా, క్రిష్ణ కాంత్ రెడ్డి, శ్రీనివాసరావు, పార్టీ నేతలు షరీఫ్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment