విద్యార్థులతో కలసి ‘ఫీజు’ పోరు చేస్తాం
కర్నూలు (టౌన్): రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 29వ తేదీ లోపు ఫీజురీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లా అధ్యక్షులు ఎస్వీ మోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. లేని పక్షంలో విద్యార్థినులు, విద్యార్థులతో కలిసి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు. స్థానిక ఎస్వీ కాంప్లెక్స్‌లోని సమావేశ హాలులో పార్టీ శ్రేణులతో కలసి శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వీ మాట్లాడుతూ.. ఫీజు కోసం ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు నోటీసులు ఇస్తున్నా.. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేబినెట్ సమావేశం నిర్వహించి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా నీరు గార్చారని విమర్శించారు. రైతు భరోసా ఇస్తామని చెప్పిన చంద్రబాబు.. కేంద్ర ప్రభుత్వ పీఎం కిసాన్ పథకంతో లింకు పెట్టారన్నారు. ఇప్పటికే రెండు దఫాలు కేంద్రం నుంచి నిధులు విడుదలైనా.. రాష్ట్ర ప్రభుత్వం నయాపైసా ఇవ్వకుండా ఎగర కొట్టేందుకు కుట్ర చేస్తోందన్నారు. రాష్ట్రంలో 54 లక్షల మంది రైతుల కోసం బడ్జెట్‌లో రూ. 10 వేల కోట్లు ప్రకటించారని, అయితే ప్రభుత్వం రూ.వెయ్యి కోట్లు కూడా కేటాయించలేదన్నారు. కరువు భత్యం రూ.328 కోట్లు, పంటల బీమాకు రూ. 1,350 కోట్లు ఇవ్వలేదన్నారు.
సంక్షేమ క్యాలెండర్ విడుదల చేయాలి
సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సంక్షేమ క్యాలెండర్‌ను విడుదల చేయాలని ఎస్వీ మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. అమ్మ ఒడి కింద ఐదేళ్లలో రూ. 6 వేల కోట్లు ఖర్చు చేశారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తల్లికి వందనం పథకం అమలు చేయాలంటే రూ.20 వేల కోట్లు కేటాయించాల్సి ఉంటుందన్నారు. అయితే ఇప్పటి వరకు రూపాయి ఇచ్చింది లేదన్నారు. 18 సంవత్సరాలు నిండిన అమ్మాయిలకు రూ.1,500, నిరుద్యోగులకు రూ. 3 వేలు ఇస్తామని చెప్పారని, ఏం చేశారని ప్రశ్నించారు? సీబీఎస్‌ఈని ఎత్తేయడం, ఇంగ్లిషు మీడియం చదువులు అటకెక్కించడం, డిజిటల్ క్లాస్‌లు, ట్యాబ్‌లు ఇవ్వకుండా విద్యావ్యవస్థను చంద్రబాబు భ్రష్టు పట్టించారన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ ఇచ్చారని గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం ఐఆర్, పీఆర్‌సీ, కనీసం డీఏలు ఇవ్వలేదని విమర్శించారు. ఒక్క హామీని అమలు చేయకుండానే ప్రభుత్వం రూ.75 వేల కోట్లు అప్పు చేసిందని, కరెంటు చార్జీలతో రూ. 15 వేల కోట్లు, రిజిస్ట్రేషన్ చార్జీలను 20 శాతం పెంచి కోట్ల రూపాయిలు ప్రజలపై భారాలు వేశారన్నారు. సంక్షేమ పథకాల అమలు కోసం సంక్రాంతి తరువాత ప్రత్యక్ష పోరు సాగిస్తామన్నారు.
నవరత్నాలు గుర్తుకు వస్తున్నాయి:
పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి
గత ప్రభుత్వంలో అమలు చేసిన నవరత్న పథకాలను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని పత్తికొండ మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి అన్నారు. చంద్రబాబు సూపర్ సిక్స్ హామీలతో సంక్షేమ పథకాలు అందుతాయని ఆశ పడ్డ ప్రజలకు నిరాశ ఎదురైందన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో మంత్రు లు, ఎమ్మెల్యేలు అసలు కనిపించడం లేదన్నారు. ఎన్నికల కోడ్ సమయంలో గత ప్రభుత్వం చేసిన పనులను ప్రస్తుత ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులు ప్రారంభిస్తున్నారన్నారు. ఆరు నెలల్లోనే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ప్రారంభమైందన్నారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మద్దూరు సుభాష్ చంద్రబోస్, జిల్లా మాజీ అధ్యక్షురాలు సిట్రా సత్యనారాయణమ్మ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. రైతులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలందరూ కూటమి ప్రభుత్వంపై దుమ్మెత్తి పోస్తున్నారన్నారు. ప్రజల పక్షాన సంక్షేమ పథకాలు అమలు చేసేంత వరకు పోరాటం చేస్తామన్నారు. కాలయాపన చేయకుండా ఇప్పటికై న ప్రభుత్వం ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పార్టీ కార్యదర్శులు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
ఈ నెల 29లోపు ఫీజు రీయింబర్స్
మెంట్ నిధులు విడుదల చేయాలి
లేదంటే జిల్లా వ్యాప్తంగా
ఆందోళనలు నిర్వహిస్తాం
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
ఎస్వీ మోహన్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment