మధ్యాహ్న గుడి భోజనం
మంత్రాలయం: ఈ చిత్రం చూస్తుంటే బడిలో విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి బారులుదీరారని అనుకుంటున్నారా.. కాదండోయ్.. గుడి భోజనం కోసం మధ్యాహ్నం పూట బారులుదీరిన చిత్రమిది. కోసిగి బాలుర ఉన్నత పాఠశాలలో దాదాపు 1,200 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అందులో శుక్రవారం 350 మంది పాఠశాలలో భోజనం చేసినట్లు ప్రధానోపాధ్యాయుడు ఖలీల్ అహ్మద్ సెలవిచ్చారు. సాధారణంగా ఉన్నత పాఠశాలలో మధ్యాహ్నం 12 గంటల నుంచి 1గంట వరకు మధ్యాహ్న భోజనాలు జరుగుతాయి. ఇక్కడ మాత్రం మెనూ ప్రకారం శుక్రవారం 350 మందికి చిత్రన్నం, టమాట కర్రీ వడ్డించినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. 350 మంది విద్యార్థులు భోజనాలు ముగించుకోవడానికి కనీసం గంట సమయం పడుతుంది. ఆపై భోజన పాత్రలు శుభ్రం చేసుకోవడానికి వంట మనుషులకు ఎంత లేదన్నా గంట సమయం పడుతుంది. అయితే ఇక్కడ అలాంటిది ఏమీ కనిపించలేదు. హెచ్‌ఎం చెప్పిన ప్రకారం ఒంటి గంటలోపే ఇక్కడ భోజనాలు ముగిసినట్లు చెబుతున్నారు. బడి వెనుక భాగంలో సుంకులమ్మ దేవి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం చేపట్టారు. ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు భోజనాలకు ఆహ్వానించినట్లు, అందుకు లెటర్ పెట్టినట్లు హెచ్‌ఎం చెప్పుకొచ్చారు. మరి గ్రామస్తులు, విద్యార్థులు భోజనాలకు రావాలని లెటర్ ఇచ్చి ఉంటే పాఠశాలలో భోజనం ఎందుకు చేసినట్టో అర్థంకాని ప్రశ్న. తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు లేదన్నట్టుగా తూతూ మంత్రంగా మధ్యాహ్న భోజనం సాగించినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment