నీటి వనరుల ఆక్రమణలను తొలగించాలి
కర్నూలు(సెంట్రల్): జిల్లాలో నీటి వనరులకు సంబంధించిన ఆక్రమణలను వెంటనే తొలగించా లని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి.నవ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాలులో నీటి వనరులు, చెరువుల భూముల జిల్లా స్థాయి పరిరక్షణ కమిటీతో జేసీ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. నీటి వనరులైన నదులు, చెరువులు, వంకలు, వాగులకు సంబంధించి సమీపంలో ఎలాంటి ఆక్రమణలు ఉన్నా, వాటిపై సర్వే చేసి పూర్తి వివరాలను 5వ తేదీలోపు సమర్పించాలని ఆదేశించారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు సంయుక్తంగా సర్వే చేపట్టాలన్నారు. మునిసిపాలిటీల్లో ఆక్రమణలపై కూడా సర్వే చేసి నివేదిక ఇవ్వాలన్నారు. నీటి వనరుల సమీపంలో బఫర్ జోన్‌ను గుర్తించి ఆయా ప్రాంతాల్లో ప్లాంటేషన్‌ను చేపట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో డీఆర్వో సి.వెంకట నారాయణమ్మ, కర్నూలు ఆర్‌డీఓ సందీప్‌కుమార్, డీపీఓ భాస్కర్, మునిసిపల్ కమిషనర్ రవీంద్రబాబు పాల్గొన్నారు.
బీఈడీ రెండో సెమిస్టర్ పరీక్షలు ప్రారంభం
కర్నూలు కల్చరల్: రాయలసీమ విశ్వవిద్యాలయం పరిధిలో బీఈడీ రెండో సెమిస్టర్ పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 17 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. 3,850 మందికి గాను 3,560 మంది హాజరు కాగా 325 మంది ఛాత్రోపాధ్యాయులు గైర్హాజరయ్యారని వర్సిటీ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎస్.వెంకటేశ్వర్లు తెలిపారు. 91.60 శాతం హాజరు నమోదైనట్లు పేర్కొన్నారు. మొదటి రోజు పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు.
బనవాసి ఏపీఆర్‌జేసీ ప్రిన్సిపాల్ సస్పెన్షన్
ఎమ్మిగనూరురూరల్: బనవాసి ఏపీ గురుకుల బాలికల జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీనివాసగుప్తాను సస్పెండ్ చేసినట్లు కాలేజీ ఇన్‌చార్జ్ ప్రిన్సిపాల్ గిరివాణి తెలిపారు. శుక్రవారం ఆమె మాట్లాడుతూ.. కాలేజీలో విద్యార్థినిని లైబ్రేరియన్ వేధించిన ఘటనలో ప్రిన్సిపాల్‌ను బాధ్యుడిని చేస్తూ గురుకుల కాలేజీ సొసైటీ కమిషనర్ సస్పెండ్ చేశారన్నారు. అలాగే విద్యార్థినుల విన్నపం మేరకు ముగ్గురు పురుష గెస్ట్ ఫ్యాకల్టీలు, ఒక లైబ్రరీయన్, మహిళా పీడీని కూడా విధుల నుంచి తొలగించినట్లు తెలిపారు. కాలేజీలో మొత్తం స్టాఫ్ మహిళలే ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు.
జూనియర్ కాలేజీల్లో నేటి నుంచి మధ్యాహ్న భోజనం
కర్నూల సిటీ: ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని శనివారం జూనియర్ కాలేజీ విద్యార్థులకు సైతం అమలు చేయనున్నారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. జిల్లాలోని 23 ప్రభుత్వం జూనియర్, ఒకేషనల్ కాలేజీల్లో మాత్రమే ఈ పథకాన్ని అమలు చేయనున్నారు.
సాంకేతిక లోపంలో నిలిచిన వాస్కోడిగామా ఎక్స్‌ప్రెస్
కోసిగి: వాస్కోడిగామా నుంచి జాషిద్ (17321)కు వెళ్లే ఎక్స్‌ప్రెస్ రైలు శుక్రవారం సాంకేతిక లోపంతో కోసిగి రైల్వే స్టేషన్ సమీపంలో నిలిచిపోయింది. సాయంత్రం ఈ రైలు కోసిగి మీదుగా రాయచూరు వైపు వెళ్తుండగా బీ4 ఏసీ బోగి అడుగు భాగంలో రాపిడికి నిప్పురవ్వలు రావడాన్ని పైలెట్ గుర్తించారు. అతను రాయచూరు రైల్వే స్టేషన్ ఇంజినీర్లతో సంప్రదించగా.. తక్కువ స్పీడ్‌తో రమ్మని ఆదేశాలు ఇవ్వడంతో 40 కి.మీ స్పీడ్‌తో రాయచూరుకు వెళ్లాడు. అయితే రైల్వే గేటు వద్ద సాయంత్రం 5.30 గంటల నుంచి గంటల నుంచి 6.10 గంటల వరకు (దాదాపు 40 నిమిషాలు) పాటు రైలు నిలిచిపోవడం వాహనదారులు గేటు తెరిచే వరకు నిరీక్షించారు.
Comments
Please login to add a commentAdd a comment