ఎన్‌టీఆర్‌ వైద్యసేవల్లో ఓపీ బంద్‌ | - | Sakshi
Sakshi News home page

ఎన్‌టీఆర్‌ వైద్యసేవల్లో ఓపీ బంద్‌

Published Mon, Jan 6 2025 7:58 AM | Last Updated on Mon, Jan 6 2025 7:58 AM

-

కర్నూలు(హాస్పిటల్‌): పేదలకు ఆరోగ్యభరోసానిచ్చే ఎన్‌టీఆర్‌ వైద్యసేవ (ఆరోగ్యశ్రీ)కి బ్రేక్‌ పడనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.3వేల కోట్లకు పైగా బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో ఆయా ఆసుపత్రులు నిరసన తెలిపేందుకు సిద్ధమయ్యాయి. ఈ మేరకు ఈ నెల 6వ తేదీ నుంచి ఎన్‌టీఆర్‌ వైద్యసేవ(ఆరోగ్యశ్రీ)లో ఓపీ సేవలు, ఎంప్లాయ్‌ హెల్త్‌ స్కీమ్‌(ఈహెచ్‌ఎస్‌) పథకంలో ఓపీతో పాటు ఐపీ సేవలు కూడా నిలిపివేయాలని నిర్ణయించాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కలిపి 229 (కర్నూలు 128, నంద్యాల 101) నెట్‌వర్క్‌ ఆసుపత్రులు ఉన్నాయి. ఇందులో ప్రభుత్వ ఆసుపత్రులు మినహా ప్రైవేటు, కార్పొరేట్‌ నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో వైద్యసేవ ఓపీ సేవలు, ఈహెచ్‌ఎస్‌ ఓపీతో పాటు ఐపీ సేవలు నిలిచిపోనున్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర చేస్తోందన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. అనుకున్నట్లుగానే ఈ పథకాన్ని అటకెక్కించి దాని స్థానంలో ఏప్రిల్‌ నుంచి బీమా పథకాన్ని అమలులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు ప్రారంభించినట్లు స్వయానా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన విధి విధానాలు కూడా ఆయన చూచాయగా గతంలోనే వెల్లడించారు. బీమా కంపెనీలచే రూ.2.5లక్షల వరకు క్లెయిమ్‌ అవుతుందని, ఆ పైన ఉంటే ఎన్‌టీఆర్‌ వైద్యసేవ ట్రస్ట్‌ భరిస్తుందని చెప్పారు. అయితే నెట్‌వర్క్‌ ఆసుపత్రుల గురించి ఆయన వివరించ లేదు. నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు ఏఏ వ్యాధికి ఎంత మొత్తం క్లెయిమ్‌ చేస్తారో చెప్పలేదు. ఈ విషయం గురించి అస్సలు నెట్‌వర్క్‌ ఆసుపత్రులతో చర్చించనూ లేదు. దీనికితోడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసుపత్రులకు బకాయి పడ్డ రూ.3వేల గురించి ఎలాంటి ప్రకటనా చేయలేదు. బకాయిలు విడుదల చేయాలని ఆసుపత్రులు విన్నవించినా చెవిన వేసుకోలేదు.

ఈహెచ్‌ఎస్‌లో ఓపీ, ఐపీ కూడా

నిలుపుదల

నేటి నుంచి నిరసన తెలపనున్న

ఆసుపత్రులు

నిర్వహణ భారమై..

వైద్యసేవకు సంబంధించి తమ బకాయిలు పెరిగిపోతున్నందున ఆసుపత్రుల నిర్వహణ కష్టంగా మారిందని యాజమాన్యాలు చెబుతున్నాయి. మందులు, సర్జికల్స్‌, వైద్యపరికరాల కొనుగోలుకు సంబంధించి ఏజెన్సీలకు అప్పులు పెరిగిపోయాయని, కొన్ని ఏజెన్సీలు వాటిని సరఫరా చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ‘వైద్యులు సైతం క్లెయిమ్‌ల సంగతి మాకు చెప్పవద్దు, అవి ఎప్పుడు వచ్చినా మీరే తీసుకోండి, ముందు మా సేవలకు డబ్బు వెంటనే ఇచ్చేయాలి’ అని ఒత్తిడి చేస్తున్నారని, డబ్బు ఇవ్వకపోతే డాక్టర్లు కూడా రావడం లేదని ఆయా ఆసుపత్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో సోమవారం నుంచి సేవలు నిలిపివేయాల్సి వస్తోందని నెట్‌వర్క్‌ ఆసుపత్రుల యాజమాన్యాలు చెబుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement