కరీమాబాద్ : విత్తు విత్తింది మొదలు.. పంట చేతికొచ్చి మార్కెట్‌లో విక్రయించే వరకు అన్నదాత ప్రతీ చోట మోసానికి గురవుతూనే ఉన్నాడు. వ్యాపారుల నుంచి మొదలు.. దళారులు, అధికారుల వరకు.. ఇలా అన్ని చోట్ల రైతు దగా పడుతూనే ఉన్నాడు. అయినా ఎలాంటి లాభాపేక్షా లేకుండా మట్టిపై మమకారంతో వ్యవసాయం చేస్తూ దేశానికి అన్నం పెడుతున్నాడు. ఇలాంటి రైతుల విషయంలో కొందరు విత్తన వ్యాపారులు మాయాజాలం ప్రదర్శిస్తున్నట్లు తెలుస్తోంది. అక్రమ సంపాదనలో ఆరితేరిన కొందరు వ్యాపారులు రైతుల ఆసక్తిని ఆసరా చేసుకుని ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన అడ్రస్ లేని పత్తి విత్తనాలను అంటగడుతున్నట్లు తెలుస్తోంది. ఏళ్ల తరబడి తమ షాపులకే వస్తున్న రైతులను ఎంచుకుని వారిని నమ్మించి విత్తనాలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సుమారు 1600 కు పైగా లైసెన్స్ కలిగిన విత్తన దుకాణాలున్నట్లు సమాచారం.
రైతుల ఆసక్తే ఆసరాగా ..
రైతులు ఆసక్తి చూపుతున్న విత్తనాలను ఎక్కువ ధరకు విక్రయించడం, ఇతర రాష్ట్రాల నుంచి తెచ్చిన విత్తనాలకు బిల్లులు లేకుండా అంటగడుతుండడం, బీజీ–3 పేరిట రైతులను మభ్యపెడుతుండడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారుతోంది. జిల్లాలో కొద్ది రోజులుగా ఈ తతంగం జరుగుతున్నా వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి..
సాగు ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పద్ధతిలో ఉంటుంది కొన్ని రాష్ట్రాల్లో ముందుగానే పత్తి విత్తితే.. మరికొన్ని రాష్ట్రాల్లో ఆలస్యంగా విత్తుతుంటారు. ఈ నేపథ్యంలో విత్తన వ్యాపారంలో పేరు గడించిన కొందరు విత్తనోత్పత్తి ఎక్కువగా జరిగే మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల నుంచి విత్తనాలు దిగుమతి చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. బీజీ–3 పేరు చెబుతున్న వాటికి ఇక్కడ విక్రయించే అనుమతులు లేకపోవడంతో రహస్యంగా విక్రయిస్తున్నట్లు సమాచారం.
గ్రామాల్లో ఏజెంట్లతో అమ్మకాలు..
ఇతర రాష్ట్రాల నుంచి తీసుకొచ్చిన పత్తి విత్తనాలు ఇక్కడ విక్రయించే అవకాశం లేకపోవడంతో తమ షాపులలో పని చేసే వ్యక్తులతోపాటు గ్రామాలలో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని అమ్ముతున్నట్లు తెలుస్తోంది. రైతులు కూడా పెట్టుబడి తగ్గించుకోవాలనే ఆలోచనకు రావడంతో వారికి తగ్గట్టుగానే వ్యాపారులు బీజీ–3 విత్తనాలు వినియోగిస్తే చేనులో కలుపు రాకుండా ఉంటుందని, చీడపీడలు తక్కువ ఆశిస్తాయని చెబుతున్నారని తెలుస్తోంది. కొన్ని ఏళ్లుగా జరుగుతున్న ఘటనలను పరిశీలిస్తే విత్తన కంపెనీల్లో పనిచేసిన వ్యక్తులు, డిస్ట్రిబ్యూటర్, డీలర్లుగా వ్యవహరించిన వారు అక్రమ దందాలలో భాగస్వాములవుతున్నట్లు తెలుస్తోంది.
విత్తన వ్యాపారుల మాయాజాలం...
అనుమతిలేని పత్తి విత్తనాలు
బ్లాక్‌లో విక్రయం
బీజీ–3 పేరిట దందా..
ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి
గ్రామాల్లో ఏజెంట్ల ద్వారా అమ్మకాలు
బిల్లులు లేకున్నా కొనుగోలు చేస్తున్న రైతులు
పట్టించుకోని వ్యవసాయ శాఖ అధికారులు
బిల్లులు లేని ప్యాకెట్లకు బాధ్యులెవరు?
రైతుల ఆసక్తిని ఆసరా చేసుకున్న కొందరు వ్యాపారులు వారు కోరిన విత్తనాలకు అధిక ధర తీసుకోవడమే కాకుండా బిల్లులు ఇవ్వడం లేదని తెలుస్తోంది. రైతులు ఈ సంవత్సరం నాథ్ సీడ్ కంపెనీకి చెందిన సంకేత్, యూఎస్ అగ్రిసీడ్ కంపెనీకి చెందిన యూఎస్ 7067 పత్తి విత్తనాలపై ఆసక్తి చూపుతుండడంతో వ్యాపారులు ఇతర రాష్ట్రాల నుంచి తీసుకువచ్చి రూ.2500 నుంచి రూ. 3000 వరకు బిల్లులు లేకుండా ఇస్తున్నట్లు తెలుస్తోంది. గత అనుభవాల దృష్ట్యా పంటల నష్టం జరిగితే ఎవరు బాధ్యులనేది ప్రస్తుతం ప్రశ్నగా మారుతోంది. రైతులకు విత్తనాలు, కొనుగోళ్లలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాల్సిన వ్యవసాయ శాఖ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment