బోగీల నుంచి వస్తున్న పొగలు
డోర్నకల్: మహబూబాబాద్–గుండ్రాతిమడుగు రైల్వేస్టేషన్ల మధ్య బుధవారం ఈస్ట్‌కోస్టు రైలులో పొగలు రావడంతో ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సికింద్రాబాద్‌నుంచి షాలిమార్‌కు వెళ్తున్న ఈస్ట్‌కోస్ట్ ఎక్స్‌ప్రెస్ మహబూబాబాద్ స్టేషన్ దాటి గుండ్రాతిమడుగు సమీపిస్తుండగా రైలులోని ఓ బోగీ నుంచి పొగలు రావడంతో లోకోపైలట్ రైలును నిలిపివేశాడు. రైలు చివరి బోగీ చక్రాలకు బ్రేకులు అతుక్కోవడంతో పొగలు వచ్చినట్లు గుర్తించి డ్రైవరు, గార్డు మరమ్మతులు చేశారు. కాగా, ఆందోళనకు గురైన ప్రయాణికులు రైలు దిగి పట్టాలకు దూరంగా వెళ్లి నిల్చున్నారు. సుమారు 25 నిమిషాల అనంతరం రైలు డోర్నకల్ స్టేషన్‌కు చేరుకోగా సీఅండ్‌డబ్ల్యూ సిబ్బంది చివరి బోగీ(జనరల్ బోగి) కింద చక్రాల బ్రేకులకు పూర్తిస్థాయి మరమ్మతులు చేసిన అనంతరం రైలును కదిలించారు.
మహబూబాబాద్‌లో చైన్ పుల్లింగ్...
అంతకుముందు ఈస్ట్ కోస్టు రైలు మహబూబాబాద్ స్టేషన్‌కు చేరుకున్న సమయంలో గుర్తుతెలియని వ్యక్తి చైను లాగడంతో రైలు ఆగినట్లు సమాచారం. అక్కడి సిబ్బంది బ్రేక్‌లు రిలీజ్ చేయగా రైలు కదలడంతో బ్రేకులు చక్రాలను పూర్తిగా వీడకపోవడంతో గుండ్రాతిమడుగు సమీపంలోకి వెళ్లగానే రైలు చివరి బోగీ నుంచి పొగలు వచ్చినట్లు తెలిసింది. పొగలు వస్తున్న విషయం గమనించిన గేట్‌మెన్ ఎర్ర జెండా చూపి అప్రమత్తం చేయడంతో సిబ్బంది రైలును ఆపి మరమ్మతులు చేశారు.
ఆందోళనకు గురైన ప్రయాణికులు
Comments
Please login to add a commentAdd a comment