ఏసీబీ వలలో సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఎస్‌డీఎం
మహబూబాబాద్ రూరల్ : వ్యవసాయ భూమికి సంబంధించిన వివరాల టీపన్ కోసం ఓ అధికారిణి లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులకు పట్టించిన సంఘటన జిల్లా కలెక్టరేట్‌లో గురువారం చోటుచేసుకుంది. ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్ శివనగర్ ప్రాంతానికి చెందిన తాళ్ల కార్తీక్ జిల్లాలోని కురవి మండలం స్టేషన్ గుండ్రాతిమడుగు గ్రామ శివారున ఉన్న సర్వే నంబర్ కే.41667/ 77లో 2.50 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోలు చేసేందుకు నిర్ణయించుకున్నా డు. ఆ భూమికి సంబంధించిన వివరాలు, వివాదా లు, అనుమానాల నివృత్తి, టీపన్ కోసం జిల్లా సర్వే, భూమి రికార్డుల అధికారి కార్యాలయంలో సీనియర్ డ్రాఫ్ట్‌మెన్ అధికారిణి కె.జ్యోతిశర్మబాయిని సంప్రదించాడు. సదరు భూమికి టీపన్ ఇవ్వాలంటే చలానా కట్టాల్సిఉంటుందని, అందుకు రూ.5 వేలు ఇవ్వాలని ఆమె చెప్పగా కార్తీక్ అక్టోబర్ 28న డబ్బులు ఇచ్చి దరఖాస్తు చేసుకున్నాడు. ఆ టీపన్ కోసం పలుమార్లు సంబంధిత కార్యాలయానికి వస్తున్నా పనిపూర్తికాకపోగా ఆమె మళ్లీ రూ.20 వేలు ఇస్తేనే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పగా ఈ నెల 12న లంచం ఇవ్వడం ఇష్టంలేక కార్తీక్ వరంగల్‌లో ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కార్తీక్ నుంచి సీనియర్ డ్రాఫ్ట్‌మెన్ అధికారి జ్యోతిశర్మబాయి రూ.20 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం ఆ కార్యాలయంలోని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి జ్యోతిశర్మబాయిని శుక్రవారం వరంగల్ ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారులు ఎవరైనా లంచం కోసం డిమాండ్ చేస్తే 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కోరారు. ఈ దాడుల్లో ఏసీబీ సీఐలు ఎల్.రాజు, ఎస్.రాజు, సిబ్బంది పాల్గొన్నారు.
టీపన్ ఇవ్వడానికి రూ.20వేలు డిమాండ్
ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు
Comments
Please login to add a commentAdd a comment