సండే సందడి..
మంగపేట: ములుగు జిల్లా మంగపేట మండల పరిధిలోని మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులు ఉదయాన్నే బస్సులు, కార్లు, ఆటోలు ఇతర వాహనాల్లో గుట్టపైకి చేరుకున్నారు. దీంతో దైత అమ్మవారు(వనదేవత), ఆలయ ప్రాంగణంలోని కల్యాణ మండపంతో పాటు పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చిన భక్తులతో సందడి నెలకొంది. అత్యంత భక్తిశ్రద్ధలతో పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు తిలతైలాభిషేకం పూజా కార్యక్రమంలో పాల్గొనేందుకు హేమాచల కొండపై ఉన్న ఆలయానికి చేరుకున్నారు. ఉదయం 10నుంచి 12 గంటల వరకు ఆలయ పూజారులు, పవన్‌కుమార్ ఆచార్యులు, శేఖర్‌శర్మ స్వామివారికి నువ్వుల నూనెతో తిలతైలాభిషేకం, ప్రత్యేక అర్చనలు జరిపించి పట్టు వస్త్రాలతో అలంకరించారు.
భక్తిశ్రద్ధలతో పూజలు
ఈ సందర్భంగా భక్తులు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో పాల్గొని మానవ శరీరంతో పోలి ఉండే స్వామివారి నిజరూప దర్శనం చేసుకుని పరవశించారు. అనంతరం భక్తులకు ఆలయ పూజారులు గోత్ర నామాలతో స్వామివారికి ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణం వివరించి వేద ఆశీర్వచనం ఇచ్చారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు ఆలయంలో నిత్యం కొనసాగుతున్న అన్నదాన ప్రసాదం స్వీకరించారు.కాగా కార్యక్రమం నిరంతరం కొనసాగించాలని ఆకాంక్షస్తూ నిర్వహణకు భక్తులు వారి స్థోమత మేరకు విరాళాలను అందజేశారు. సుదూర ప్రాంతాల నుంచి కార్లు, ప్రైవేట్ బస్సులలో వచ్చిన భక్తులు దైత అమ్మవారికి కోళ్లు, మేకలను బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. చెట్లకింద వంటావార్పు చేసుకుని కుటుంబ సభ్యులతో కలిసి భోజనాలు చేసి సాయంత్రం వరకు సేదతీరి వారి స్వస్థలాలకు తరలివెళ్లారు.
హేమాచలక్షేత్రానికి
భారీగా తరలివచ్చిన భక్తులు
Comments
Please login to add a commentAdd a comment