సైబర్ మోసం..
● ఫోన్ కాల్ లిఫ్ట్ చేయడంతో రూ.8.14 లక్షలు మాయం
● కొద్ది గంటల్లోనే మూడు బ్యాంకు ఖాతాలు గుల్ల చేసిన కేటుగాళ్లు
● లబోదిబోమంటూ పోలీసులకు బాధితుడి ఫిర్యాదు
గార్ల : ప్రభుత్వాలు ఎంత కట్టడి చేసిన సైబర్ మోసాలు ఆగడం లేదు. కేటుగాళ్లు ఏదో రూపంలో అమాయకుల ఖా తాలను గుల్లచేస్తూనే ఉన్నారు. దీనికి నిదర్శనమే ఈ ఘటన. అగంతకుడు ఫోన్ చేయడంతో ఓ వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అన్నాడు. అంతే.. కొద్ది గంటల్లోనే అతడి 2 బ్యాంకు అకౌంట్లు , తన తల్లి అకౌంట్ నుంచి రూ.8.14 లక్షలు మాయమయ్యాయి. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం బుద్దారంతండాలో చోటుచేసుకుంది. ఎస్సై రియాజ్‌పాషా కథనం ప్రకారం.. తండాకు చెందిన వాంకుడోత్ సంతోశ్‌కుమార్ కడపలోని జోయాలుక్కాస్ గోల్డ్ షోరూంలో ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో సంతోశ్‌కు ఈనెల 5వ తేదీన ఓ అగంతకుడు +447873 078154 నంబర్‌తో ఫోన్ చేశాడు. కాల్ లిఫ్ట్ చేసి హలో అని అనగానే కట్ అయ్యింది. అనంతరం అగంతకుడు గంట తర్వాత సంతోశ్ ఫోన్ సిమ్‌ను బ్లాక్ చేశాడు. డ్యూటీలో బిజీగా ఉండడంతో సంతోశ్ సిమ్‌ను సరిచేసుకోలేకపోయాడు. సిమ్ బ్లాక్ అయిన నేపథ్యంలో సంతోశ్ బ్యాంకు అకౌంట్ల నుంచి రూ.8.14 లక్షలు డ్రా అయినా మొబైల్‌కు మెసెజ్‌లు రాలేదు. ఈనెల 17న బాధితుడు గార్లకు వచ్చి బ్యాంకులో డబ్బు డ్రా చేసేందుకు వెళ్లగా తన రెండు అకౌంట్ల నుంచి రూ.1,28,000, రూ.1,23,000, తన తల్లి అకౌంట్ నుంచి రూ.5,63,000 డ్రా అయినట్లు బ్యాంకు సిబ్బంది తెలిపారు. 2 అకౌంట్లతో పాటు, తల్లి అకౌంట్‌కు సైతం సంతోశ్ తన సెల్ నంబర్‌ను లింక్ చేశాడు. దీంతో లబోదిబోమంటూ గార్ల పీఎస్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ఎవరికై నా +44, +11, +55 నుంచి 12 అంకెలతో ఫోన్ వస్తే లిఫ్ట్ చేయొద్దని ఎస్సై సూచించారు. అకౌంట్ల నుంచి డబ్బులు డ్రా అయినట్లు మెసెజ్‌లు వస్తే వెంటనే 1930 సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్‌కు సమాచారం ఇస్తే అకౌంట్లను వెంటనే బ్లాక్ చేస్తారని ఎస్సై పేర్కొన్నారు.
డీలర్‌షిప్ పేరుతో మోసం.. రూ. 7 లక్షలు స్వాహా..
కొడకండ్ల : డీలర్‌షిప్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసానికి పాల్పడ్డారు. అమాయకుడి వద్ద రూ.7 లక్షలు కొల్లగొట్టారు. ఈ ఘటన మండలంలోని హక్యతండాలో చోటు చేసుకుంది. పాలకుర్తి సీఐ గట్ల మహేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. తండా చెందిన గుగులోత్ అశోక్ ఫెర్టిలైజర్ ఇండియాలో డీలర్‌షిప్ ఉందని ఫేస్‌బుక్‌లో ఓ యాడ్ చూశాడు. యాడ్‌పై క్లిక్ చేయగా వివరాలు కనిపించడంతో నమోదు చేశాడు. యాడ్ నిర్వాహకులు చెప్పినట్లు ఆరు నెలల నుంచి విడతల వారీగా ఆన్‌లైన్‌లో రూ.7 లక్షలు చెల్లించాడు. అయినా వారి నుంచి సమాధానం రాకపోవడంతో మోసపోయానని గ్రహించి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దీంతో బాధితుడి ఫిర్యాదు మేరకు ఎస్సై రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్ల సీఐ మహేందర్‌రెడ్డి సోమవారం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment