మారని తీరు..
నారాయణపేట/మక్తల్/మాగనూర్: దాదాపు వంద మంది విద్యార్థులు నాణ్యత లేని మధ్యాహ్న భోజనం తిని ఆస్పత్రి పాలు కాగా.. అయినా కూడా సదరు సిబ్బంది తీరు మారడంలేదు. గురువారం సైతం మధ్యాహ్న భోజనంలో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. బుధవారం మాగనూరు జెడ్పీ పాఠశాలలో మధ్యాహ్న భోజనం నాణ్యతగా లేకపోవడంతో ఆ ఆహారం తిన్న దాదాపు వంద మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయింది. వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మక్తల్, మహబూబ్‌నగర్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన విషయం తెలిసిందే. సరిగ్గా ఒక్కరోజు కూడా కాకముందే మరోసారి అన్నంలో పురుగులు రావడం.. కలెక్టర్ ఆదేశించినా సదరు సిబ్బంది నిర్లక్ష్యం వీడకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
విద్యార్థుల అస్వస్థతపై కలెక్టర్ విచారణ
జిల్లాలోని మాగనూరు జెడ్పీహెచ్‌ఎస్‌లో బుధవారం మధ్యాహ్న భోజనం కలుషితమై విద్యార్థులు అస్వస్థతకు గురైన సంఘటనపై గురువారం కలెక్టర్ సిక్తా పట్నాయక్ క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టారు. పాఠశాల వంట గది, స్టోర్ రూం, వంటకు వినియోగించే బియ్యం, నిత్యావసరాల సరుకులను పరిశీలించారు. పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ఆరా తీశారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఇకపై ప్రతిరోజు మధ్యాహ్న భోజనాన్ని పాఠశాల హెడ్మాస్టర్, ఉపాధ్యాయులు పరిశీలించి, రుచి చూసిన తర్వాతే విద్యార్థులకు వడ్డించాలని ఆదేశించారు. ఈ సంఘటనలో 17 మంది విద్యార్థులకు వాంతులతో అస్వస్థతకు గురయ్యారని, వారిని మక్తల్ సీహెచ్‌సీ, మహబూబ్‌నగర్ జనరల్ ఆస్పత్రికి తరలించి వైద్య పరీక్షలు అందించినట్లు తెలిపారు. తాజాగా మహబూబ్‌నగర్ కలెక్టర్, ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు సమాచారం అందించి విద్యార్థుల యోగక్షేమాలు తెలుసుకున్నామని, ప్రస్తుతం విద్యార్థులు కోలుకుంటున్నారని, వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని కలెక్టర్ వెల్లడించారు. ఈ ఘటనపై పాఠశాల హెచ్‌ఎంను సస్పెండ్ చేయడంతో పాటు వంట ఏజెన్సీని రద్దు చేసి ఇతర ఏజెన్సీకి అప్పగిస్తున్నట్లు తెలిపారు. ఇక నుంచి ప్రతి పాఠశాలలో టెస్టింగ్ (నాణ్యత పరిశీలన) కమిటీని ఏర్పాటు చేసి మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ స్పష్టం చేశారు. బియ్యాన్ని, మార్కెట్ నుంచి వచ్చే కూరగాయలు, కోడిగుడ్లను పరిశీలించిన తర్వాతే పాఠశాలకు తీసుకురావాలని సూచించారు. భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా హెడ్మాస్టర్లు, వంట ఏజెన్సీలు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆదేశించారు.
మాగనూర్ జెడ్పీహైస్కూల్‌లో మధ్యాహ్న భోజనంలో మళ్లీ పురుగులు
అన్నం పారబోసి విద్యార్థుల ఆందోళన
హుటాహుటిన పాఠశాలను పరిశీలించిన అడిషనల్ కలెక్టర్
విద్యార్థుల అస్వస్థతపై క్షేత్రస్థాయిలోవిచారణ చేపట్టిన కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment