ఇందిరమ్మ ‘మహిళాశక్తి’కి దరఖాస్తుల ఆహ్వానం
స్టేషన్ మహబూబ్‌నగర్: రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి ఇందిరమ్మ మహిళా శక్తి ద్వారా మైనార్టీ మహిళలకు ఉచిత కుట్టుమిషన్‌లు అందించనున్నట్లు జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి శంకరాచారి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. మైనార్టీ మహిళలు ఈ నెల 31వ తేదీ వరకు tgobmms.cgg.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. నిరుపేద, నిరాశ్రయులు, వితంతువు, విడాకులైన మహిళలు, అనాథ, ఒంటరి మహిళలకు ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. తెల్లరేషన్ కార్డు, ఆహారభద్రత కార్డు రెండు లేకపోతే గ్రామీణ ప్రాంతం వారికి రూ.1.50లక్షలు, పట్టణప్రాంతం వారికి రూ.2 లక్షలు మించకుండా ఆదాయ ధ్రువపత్రం ఉండాలని పేర్కొన్నారు. నివాస ధ్రువీకరణ కోసం ఆధార్‌కార్డు, 18–55 ఏళ్ల వారు ఈ పథకం అర్హులని, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు పొందిన సంస్థ ద్వారా టైలరింగ్ సర్టిఫికెట్, కనీసం 5వ తరగతి విద్య అర్హత ఉండాలని తెలిపారు.
కందులు క్వింటా రూ.7,769
దేవరకద్ర: స్థానిక మార్కెట్ యార్డులో శుక్రవారం జరిగిన టెండర్లలో కందుల ధర క్వింటాల్‌కు గరిష్టంగా రూ.7,769, కనిష్టంగా రూ.7,619గా ధరలు నమోదయ్యాయి. ఆర్‌ఎన్‌ఆర్ ధాన్యం ధర గరిష్టంగా రూ.2,609గా ఒకే ధర లభించింది. కందులు వంద బస్తాలు, వరి ధాన్యం వంద బస్తాలు అమ్మకానికి వచ్చింది.
28 నుంచి 31 వరకు ఆన్‌లైన్ సేవలు బంద్
స్టేషన్ మహబూబ్‌నగర్: కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్‌ఎస్) జారీ చేసి న ఉత్తర్వు ప్రకారం ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ (ఏపీజీవీబీ) ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తమ కార్యకలాపాలను విభజించడం జరుగుతుందని బ్యాంకు రీజినల్ మేనేజర్ ఎ.రవికిషోర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ తెలంగాణలోని 493 ఏపీజీవీబీ శాఖలు వచ్చేనెల 1వ తేదీ నుంచి హైదరాబాద్ ప్రధాన కార్యాలయంగా ఉన్న తెలంగాణ గ్రామీణ బ్యాంక్ (టీజీబీ)లో విలీనం చేయనున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో విలీన ప్రక్రియలో ఏర్పడే సాంకేతిక సమస్యల కారణంగా ఈనెల 28వ తేదీ నుంచి 31 వరకు అన్ని శాఖల్లో బ్యాంకింగ్ సేవలు, ఆన్‌లైన్ లావాదేవీలు (యూపీఐ, ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్) అందుబాటులో ఉండవని పేర్కొన్నారు. ఈ అసౌకర్యానికి చింతిస్తున్నామని, తిరిగి బ్యాంకింగ్ సేవలు వచ్చేనెల 1వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులో ఉంటాయని తెలిపారు. ఖాతాదారులందరూ మాకు సహకరించి ఆర్థిక లావాదేవీలను ఈనెల 27వ తేదీ లోగా పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి. రాష్ట్రంలోని ఏజీవీబీ శాఖలకు సంబంధించిన ఖాతాదారులు ఏటీఎం కార్డు మార్చుకునేందుకు, మొబైల్ బ్యాంకింగ్, ఇంటర్‌నెట్ బ్యాంకింగ్ సేవలు, యూపీఐ సేవలను తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వచ్చేనెల 1వ తేదీ నుంచి మీ శాఖను సంప్రదించాలని కోరారు. ఖాతాదారులకు మరింత విలువైన సేవలు అందించడానికి సంసిద్ధంగా ఉంటామని చెప్పారు.
రేపు పదరా పోదాం మన్యంకొండ
స్టేషన్ మహబూబ్‌నగర్: ధర్మవాహిని పరిషత్ పాలమూరు ఆధ్వర్యంలో ఈనెల 22వ తేదీన ‘పదరా పోదాం మన్యంకొండ’ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వ్యవస్థాపకులు జోషి సంతోషాచార్యులు వెల్లడించారు. జిల్లాకేంద్రం బండ్లగేరి కుర్హినిశెట్టికాలనీలోగల తోటమైసమ్మ దేవాలయంలో శుక్రవారం రాత్రి జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పవిత్ర మార్గశిర మాసం, ధనుర్మాసం విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనదని, అలాంటి పవిత్రమైన మాసా ల్లో రెండోసారి పదరా పోదాం మన్యంకొండ సామూహిక పాదయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బండ్లగేరిలోని రుక్మిణి పాండురంగస్వామి ఆలయం నుంచి ఉదయం 5 గంటలకు ప్రారంభమయ్యే పాదయాత్ర రాంమందిర్ చౌరస్తా, వన్‌టౌన్ మీదుగా ధర్మాపూర్, మన్యంకొండ వరకు ఉంటుందని తెలిపారు. గోవిందనామస్మరణతో సామూహిక పాదయాత్ర సాగుతుందని, ఇందులో భక్తులు పాల్గొనాలని కోరారు. స్వరలహరి కల్చరల్ అకాడమీ అధ్యక్షుడు నాయిని భాగన్నగౌడ్, మేకల శ్రీనివాస్, మన్యంకొండ బోర్డుమెంబర్ శ్రవణ్‌కుమార్, శ్రీశైలం, బుచ్చన్న, అమర్, భీమ్‌రాజ్, గంగాపురం రామకృష్ణశర్మ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment