ఉపాధిలో పూడికతీతకు స్వస్తి
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. గ్రామాల్లో పేదలకు ఉపాధి లభించే చెరువుల్లో పూడికతీత పనులకు స్వస్తి పలికింది. ఇక మీదట చెరువులు, కాల్వల్లో ఎలాంటి పనులు చేపట్టవద్దని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖకు సూచించింది. అయితే ఆరు కేటగిరీల్లో 21 రకాల పనులతో ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ నెలాఖరు నాటికి పనులు గుర్తించి వాటి అంచనాలను సిద్ధం చేసి పంపించాలని అధికారులకు ఆదేశాలు వచ్చాయి. గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామసభలు నిర్వహించి పనులు గుర్తిస్తున్నారు. గుర్తించిన పనులను 2025 మార్చిలోగా పూర్తి చేయాల్సి ఉంది. జిల్లాలో 2.22 ఉపాధి హామీ కూలీలు ఉన్నారు. వీరిలో 1.29 లక్షల మంది కార్మికులు యాక్టివ్‌గా ఉన్నారు. 1.35 జాబ్ కార్డులు ఉండగా 85 వేల జాబ్ కార్డులు యాక్టివ్‌గా ఉన్నాయి.
● మహిళా సంఘాల సభ్యులందరికీ ఉపాధి భరోసా కల్పించేలా కేంద్రం ఉపాధి హామీలో భాగస్వాములను చేసింది. వీరిని స్వయం ఉపాధి వైపు మళ్లించేలా రుణాలిచ్చి ఆవులు, మేకలు, చేపల పెంపకం చేపట్టేలా చేస్తారు. పశువుల షెడ్లు, వర్మికంపేస్టు, అజోల మొక్కల పెంపకం, బీడు భూముల ఆభివృద్ధి చేయనున్నారు. పశువుల షెడ్లు, వర్మీ కంపోస్టు షెడ్లు మండలానికి పది చొప్పున, అలాగే పౌల్ట్రీ షెడ్లు మండలానికి ఒకటి చొప్పున నిర్మించనున్నారు.
● గ్రామాల్లో ఇంటింటి వ్యక్తిగత ఇంకుడుగుంతల నిర్మాణాన్ని చేపట్టనున్నారు. కనీసం మండలానికి పది చొప్పున నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అలాగే పాఠశాలల్లో మండలానికి ఒకచోట టాయిలెట్ల నిర్మాణం, మండలానికి కిలోమీటరు చొప్పున సీసీ రోడ్డు వేయాలని నిర్ణయించారు. అలాగే మండలానికి ఒకటి చొప్పున అంగన్‌వాడీ భవనం, గ్రామపంచాయతీ భవనాలను నిర్మించనున్నారు.
● జల సంరక్షణలో ప్రజలను భాగస్వామ్యం చేయడం. ఇంటింటా ఇంకుడుగుంతలు, ఫారంపాండ్లు, ఇంటి పైకప్పు భాగంలో కురిసిన నీటిని భూగర్భంలోకి ఇంకించేలా (రూప్ టాప్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్), చేతి పంపుల వద్ద ఇంకుడుగుంతలు, కందకాలు తవ్వడం, చెక్ డ్యాంలు కట్టేలా చర్యలు తీసుకోనున్నారు.
● పల్లెల్లో పంట ఉత్పత్తులు ఇంటికి చేర్చడానికి మట్టిదారుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. జిల్లాలో ప్రతి నియోజకవర్గంలో 20 కిలోమీటర్లు మట్టిరోడ్లు వేసుకోవచ్చు. గతంలో ఎక్కువ సంఖ్యలో ఉండే మట్టి రోడ్ల సంఖ్యను కేంద్ర తగ్గించింది.
● ఉద్యానశాఖ ఆధ్వర్యంలో పండ్ల తోటల ద్వారా రైతులను ప్రోత్సహించడం. వారికి రాయితీపై బిందు సేద్యం పరికరాలు ఇచ్చేలా చేస్తారు. జిల్లాలో ఎనిమిది లక్షల ఈత, తాటి వనాలను పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పండ్ల తోటలను మండలానికి ఐదెకరాల్లో పెంచేలా లక్ష్యం పెట్టుకున్నారు. ఇందుకు అవసరమైన నర్సరీలను సిద్ధం చేయనున్నారు.
ఆరు కేటగిరీల్లో 21 పనులకే
పథకం పరిమితం
గ్రామసభల ద్వారా పనుల గుర్తింపు
Comments
Please login to add a commentAdd a comment