రాజాపూర్: ఓ హోటల్ వద్ద భోజనం చేసేందుకు బస్సును ఆపారు. గుర్తుతెలియని దుండగులు రూ.2.95లక్షలు అపహరించిన ఘటన మండలంలోని రంగారెడ్డిగూడ శివారులో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. రాజాపూర్ ఎస్‌ఐ రవి తెలిపిన వివరాలు.. తమిళనాడు రాష్ట్రం తిరుపూర్ కామరాజ్‌నగర్‌కు చెందిన వెంకటేష్ బనియన్ల వ్యాపారం చేస్తున్నాడు. రెండు రోజుల క్రితం హైదరాబాద్‌కు వచ్చి పలు దుకాణాల్లో బనియన్లు సరఫరా చేశాడు. వారినుంచి బనియన్లకు సంబంధించిన రూ.2.95 లక్షలను తీసుకున్నాడు. హైదరాబాద్‌లోని లక్‌డికాపుల్ నుంచి శుక్రవారం రాత్రి ఓప్రైవేటు ట్రావెల్ బస్సులో తిరుపూర్‌కు బయలుదేరాడు. మండలంలోని రంగారెడ్డిగూడ వద్ద హైవేపై ఉన్న ఓహోటల్ వద్ద భోజనం కోసం బస్సును ఆపారు. డబ్బుల బ్యాగ్‌ను తాను కూర్చున్న సీటుపై పెట్టి వెంకటేష్ కూడా భోజనం చేసేందుకు హోటల్‌లోకి వెళ్లాడు. భోజనం చేశాక బస్సులోకి వచ్చి చూడగా బ్యాగ్ కనిపించలేదు. బస్సు మొత్తం వెతికినా బ్యాగ్ లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శనివారం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి విచారణ చేపట్టినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఒక తెల్లటికారులో గుర్తుతెలియని వ్యక్తులు వచ్చి చోరీకి పాల్పడినట్లు సీసీ పుటేజీల్లో గమనించినట్లు ఎస్‌ఐ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment