కాలి బూడిదైన ఆశలు
షార్ట్ సర్క్యూట్‌తో రెండు గుడిసెల దగ్ధం
●
మమ్మల్ని ఆదుకోండి..
మాది పేద కుటుంబం. మేకలు కాసుకొని బతుకుతున్నాం. ఉన్న అప్పులను తీర్చేందుకు కొన్ని రోజుల క్రితం మేకలు అమ్మగా.. రూ.7 లక్షలు వచ్చాయి. ఆ డబ్బును గుడిసెలో పెట్టి మొక్కు చెల్లించుకునేందుకు మక్తల్‌కు వెళ్తే అగ్నిపాలయ్యాయి. కట్టుబట్టలతో మిగిలి బజారులో పడ్డాం. మమ్మల్ని ఆదుకోవాలి.
– నందిగొండ మొగులయ్య,
బాధితుడు, గుర్లపల్లి
రోడ్డున పడ్డాం..
మా గుడిసెలోని వస్తువులన్నీ కాలిపోయాయి. కొత్తగా ఇంటిని కట్టుకుందామని మేకలు అమ్ముకున్నాను. గుడిసెతో పాటు రూ. 8 లక్షల నగదు, బట్టలు, వంట సామగ్రి మొత్తం అగ్నిపాలయ్యాయి. రోడ్డున పడ్డాం. ప్రభుత్వం ఆదుకోవాలి.
– నందిగొండ సందప్ప,
బాధితుడు, గుర్లపల్లి
మక్తల్: వారిద్దరు అన్నదమ్ముళ్లు.. గుడిసెల్లో ఉంటూ కూలీ పనులు చేసుకోవడంతో పాటు మేకలు పెంచుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరిలో ఒకరు చేసిన అప్పులను తీర్చేందుకు.. మరొకరు కొత్త ఇంటిని నిర్మించుకునేందుకు ఇటీవల మేకలను విక్రయించారు. ఆ డబ్బును గుడిసెల్లో పెట్టి దేవుడి మొక్కు చెల్లించుకునేందుకు వెళ్లగా.. షార్ట్ సర్క్యూట్‌తో రెండు గుడిసెలకు నిప్పంటుకొని వారి ఆశలు కాలిబూడిదయ్యాయి. ఈ ఘటన మక్తల్ మండలం గుర్లపల్లి గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. గుర్లపల్లికి చెందిన నందిగొండ మొగులయ్య, నందిగొడ సందప్ప పక్కపక్కనే రెండు గుడిసెల్లో నివాసముంటూ కూలీ పనులు చేసుకోవడంతో పాటు మేకలు పెంచుకొని జీవనం సాగిస్తున్నారు. ఇటీవల మొగులప్ప మేకలు విక్రయించగా రూ.7 లక్షలు, సందప్ప మేకలకు రూ.8 లక్షలు వచ్చాయి. ఆ డబ్బును గుడిసెలో పెట్టి, కుటుంబ సమేతంగా మక్తల్ పడమటి ఆంజనేయ స్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు. ఈ క్రమంలో ఓ గుడిసెలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడి మంటలు చెలరేగాయి. ఫైరింజన్ వచ్చినప్పటికీ ఫలితం లేకపోయింది. విషయం తెలుసుకున్న బాధిత కుటుంబాలు గ్రామానికి చేరుకునే లోపే రెండు గుడిసెలు కాలిపోయాయి. గుడిసెలో పెట్టిన డబ్బుతో పాటు భూమి పట్టాదారు పాస్‌పుస్తకాలు, పిల్లల సర్టిఫికెట్లు, దుస్తులు, వంట సామగ్రి మొత్తం కాలిబూడిదయ్యాయి. కష్టపడి సంపాదించిన సొమ్ము అగ్గిపాలు కావడంతో బోరున విలపించారు. తాము రోడ్డున పడ్డామని.. ప్రభుత్వపరంగా ఆదుకోవాలని వేడుకుంటున్నారు. విషయం తెలుసుకున్న ఆర్‌ఐ భూపాల్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మక్తల్ పోలీస్‌స్టేషన్‌లో బాధితులు ఫిర్యాదు చేశారు.
కొత్త ఇంటి నిర్మాణం, అప్పుల కోసం దాచుకున్న రూ.15 లక్షల నగదు అగ్గిపాలు
రోడ్డున పడిన నిరుపేద కుటుంబాలు
Comments
Please login to add a commentAdd a comment