రైతు భరోసాకు సన్నాహాలు
మహబూబ్‌నగర్ (వ్యవసాయం): ‘రైతు భరోసా’తో రాష్ట్ర ప్రభుత్వం రైతులకు పంట పెట్టుబడి సాయం అందించేందుకు సన్నాహాలు చేస్తుంది. ఎకరానికి రూ.12వేల చొప్పున రెండు విడతలుగా పెట్టుబడి సాయం అందజేస్తామని ప్రకటించింది. భూమి లేని రైతు కూలీలకు ఏటా రూ.12వేల చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పింది. ఈసారి సాగు యోగ్యమైన భూములకు మాత్రమే సాయం అందించడానికి అధికారులు పకడ్బందీగా చర్యలు చేపట్టనున్నారు. పట్టాదారు పాస్‌పుస్తకం ప్రతీ రైతుకు రైతు భరోసా విడుదల చేస్తామని ఈనెల 26న ప్రభుత్వం ప్రకటించింది. ఏడాదికి రూ. 12 వేల చొప్పున అందించనున్నారు. పథకం పక్కదారి పట్టకుండా వ్యవసాయేతర భూములను గుర్తించేందుకు అవసరమైన కార్యాచరణను రూపొందిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇప్పటివరకు గత ప్రభుత్వం రైతుబంధు పథకం కింద పెట్టుబడి సాయాన్ని అందించింది. జిల్లాలో గత వానాకాలం సీజన్‌లో రూ.220.13 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసింది.
రైతుల ఆశలన్నీ ‘రైతు భరోసా’పైనే
జిల్లాలో రైతు భరోసాపైనే రైతులు ఆశలు పెట్టకున్నారు. సంక్రాంతి నుంచి ఈ సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేస్తామని ప్రభుత్వం ఇది వరకే ప్రకటించింది. ఇందులో భాగంగా ఈనెల 26 నుంచి అర్హులైన రైతులకు ప్రతి ఏడాది ఎకరానికి రూ.12వేల చొప్పున నగదు జమ చేసే ప్రక్రియ మొదలుపెట్టనుంది. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం జారీ చేసింది. వానాకాలం, యాసంగి సీజన్లలో రూ.6వేల చొప్పున నగదు అందించనుంది. ప్రస్తుతం ప్రభుత్వం రూపొందించిన విధి విధానాల ప్రకారం ఎందరికి భరోసా దక్కుతుందో ఈనెల 26వ తేదీన తేలనుంది. గతంలో రైతుబంధు పేరిట వ్యవసాయేతర భూములకు సైతం రైతుబంధు అందింది. ఇప్పుడు మాత్రం సాగులో ఉన్న, సాగుకు యోగ్యమైన భూములకు భరోసా ఉంటుందని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. భూ భారతి పోర్టల్‌లో నమోదై ఉన్న సాగు భూములకు పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించనుంది. జిల్లాలో 3.50లక్షల ఎకరాల్లో సాగు భూములున్నాయి. ఇందులో 2,19,237మంది రైతులు రైతుబంధు కింద పెట్టుబడి సాయాన్ని పొందుతూ వచ్చారు.
గ్రామ నక్షా, గూగుల్ మ్యాప్‌తో సర్వే
గురువారం నుంచి ఈ నెల 20వ తేదీ వరకు జిల్లావ్యాప్తంగా సాగు యోగ్యం కాని భూములను పక్కాగా గుర్తించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. తహసీల్దార్, ఏఓ, ఏఈఓ, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌తో కూడిన బృందాలు గ్రామ నక్షా, గూగుల్ మ్యాప్‌తో భూభారతి భూముల వివరాలతో సర్వేలో పాల్గొంటారు. అనంతరం సర్వేలో అర్హులుగా గుర్తించిన రైతుల జాబితాను 21 నుంచి 24 వరకు జరిగే గ్రామసభల్లో ప్రదర్శిస్తారు. సాగుకు పనికిరాని భూముల వివరాలను పోర్టల్‌లో నిక్షిప్తం చేస్తారు. సర్వే పక్కాగా నిర్వహిస్తే లబ్ధిదారుల సంఖ్య తగ్గే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు.
యాసంగికి పెట్టుబడి సాయం
గ్రామసభల్లో సాగుభూముల వివరాలు
నేటి నుంచి క్షేత్రస్థాయిలో అధికారుల సర్వే
Comments
Please login to add a commentAdd a comment