పథకాల అమలుకు అన్ని ఏర్పాట్లు
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పథకాల అమలుకు షెడ్యూల్ ప్రకారం క్షేత్రస్థాయి పరిశీలనతో పాటు గ్రామసభల ద్వారా లబ్ధిదారుల ఎంపికకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ విజయేందిర బోయి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి జిల్లాలోని ఆయా మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలు తదితర అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ నాలుగు పథకాలను ఈనెల 26న రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించనుందన్నారు. ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని, 21 నుంచి 24 వరకు గ్రామ, వార్డుసభలు నిర్వహించి అర్హుల జాబితాను తయారు చేయాలన్నారు. ఏమైనా అభ్యంతరాలు వస్తే పది రోజులలోగా పరిష్కరించాలన్నారు. 21 నుంచి 25వ తేదీ వరకు డేటా ఎంట్రీ పూర్తి చేయాలని, గ్రామ, వార్డు సభలలో ఇందిరమ్మ కమిటీలకు భాగస్వామ్యం కల్పించాలన్నారు. రైతుభరోసాలో భాగంగా ఎకరాకు రూ.12 వేలు రెండు విడతలు (రూ.6 వేల చొప్పున)గా డీబీటీ పద్థతిన ఇస్తామన్నారు. వ్యవసాయ యోగ్యం కాని భూములను ‘రైతు భరోసా’ నుంచి తొలగించాలన్నారు. ఇళ్లు లేదా కాలనీలుగా మారిన అన్ని రకాల భూములు, రియల్ ఎస్టేట్ లే–అవుట్లు, రోడ్లుగా మారిన భూములు, పరిశ్రమలకు, గోదాంలకు, మైనింగ్‌కు వినియోగిస్తున్న భూములు, ప్రభుత్వం సేకరించిన అన్ని రకాల భూమలు, రాళ్లు, రప్పలు, గుట్టలతో ఉండి సాగుకు అనువుగా లేని భూములు, వ్యవసాయ యోగ్యం కాని భూములుగా గుర్తించాలన్నారు. రేషన్‌కార్డుల జారీకి కులగణన సర్వే ఆధారంగా తయారుచేసిన రేషన్‌కార్డు లేని కుటుంబాల జాబితాను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి ‘ఉపాధిహామీ’లో నమోదు చేసుకున్న భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలే అర్హులుగా పరిగణించాలన్నారు. వారు 2023–24లో కనీసం 20 రోజులైనా పనిచేసి ఉండాలన్నారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ‘ప్రజాపాలన’లో దరఖాస్తు చేసుకున్న వారి నుంచి ఇందిరమ్మ ఇళ్ల సర్వే ద్వారా జాబితా రూపొందించామన్నారు. దీనిని రెండు రోజుల్లో మరోసారి క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని, క్షేత్రస్థాయి పరిశీలనకు సంబంధించి ముందుగానే ఆయా గ్రామాలు, వార్డుల్లో టాంటాం చేయించాలన్నారు. సమావేశంలో స్థానిక సంస్థలు, రెవెన్యూ అడిషనల్ కలెక్టర్లు శివేంద్రప్రతాప్, మోహన్‌రావుతో పాటు ఆయా శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కలెక్టర్ విజయేందిర
Comments
Please login to add a commentAdd a comment