నేడు పాలమూరుకు డీజీపీ
మహబూబ్‌నగర్ క్రైం: కొత్త ఏడాదిలో పోలీస్ శాఖను చక్కదిద్దడంతో పాటు శాంతిభద్రతల పరిరక్షణ కోసం మార్గనిర్దేశం చేయడానికి మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రానికి శుక్రవారం డీజీపీ జితేందర్ రానున్నారు. మహబూబ్‌నగర్, నారాయణపేట జిల్లాల ఎస్పీలతో పాటు ఇతర పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఉదయం 11 గంటలకు పట్టణంలోని ఎస్పీ కార్యాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. గత ఏడాది కాలంలో పోలీస్‌స్టేషన్ వారీగా నమోదైన కేసులతో పాటు పెండింగ్ ఫైల్స్, కోర్టు శిక్ష కేసుల వివరాలపై సమావేశం కొనసాగనుంది. డీజీపీ వస్తున్న క్రమంలో పోలీసులు స్టేషన్ వారీగా పెండింగ్ కేసులపై దృష్టి సారించారు.
ఎన్నికల స్టేషనరీ సరఫరాకు టెండర్ల ఆహ్వానం
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికలకు అవసరమయ్యే ఎన్నికల స్టేషనరీ సరఫరాలకు టెండర్లను ఆహ్వానిస్తున్న అదనపు కలెక్టర్ మోహన్‌రావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. అందుకు సంబంధించిన దరఖాస్తులను ఈ నెల 17వ తేదీ నుంచి 21వ తేదీ వరకు జిల్లా పంచాయతీ శాఖ కార్యాలయంలో లభించనున్నట్లు పేర్కొన్నారు. టెండర్లను కేవలం సీల్డ్ కవర్‌లోనే దాఖలు చేయాల్సి ఉంటుందని సూచించారు. 22వ తేదీన ఉదయం 11 గంటలకు అదనపు కలెక్టర్ చాంబర్‌లో సీల్డ్ కవర్‌లో దరఖాస్తు చేసిన టెండర్‌దారులు హాజరుకావాలని, ఇతర వివరాల కోసం జిల్లా పంచాయతీశాఖ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
పీయూ శుభారంభం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: తమిళనాడులోని చైన్నెలో జరుగుతున్న అఖిల భారత దక్షిణ ప్రాంత క్రికెట్ పోటీల్లో పీయూ జట్టు శుభారంభం చేసింది. మొదటి రోజు గురువారం మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీ జట్టుపై పీయూ జట్టు 68 పరుగుల తేడాతో గెలిచింది. పీయూ క్రీడాకారులు రఫీ 62, డేవిడ్ 47 పరుగులు చేసి విజయంలో భాగస్వాములయ్యారు. అలాగే డేవిడ్ మూడు వికెట్లు, మూకిత్ రెండు వికెట్లు తీశారు. కాగా, వీరికి పీయూ వైస్ చాన్స్‌లర్ ఆచార్య జి.ఎన్. శ్రీనివాస్, రిజిస్ట్రార్ ఆచార్య డి.చెన్నప్ప, ఓఎస్‌డీ డా.మధుసూదన్‌రెడ్డి, పీడీ డా.వై.శ్రీనివాసులు అభినందనలు తెలిపారు.
23న పీయూకిన్యాక్ బృందం
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: పాలమూరు యూనివర్సిటీ (పీయూ) క్యాంపస్‌ను ఈనెల 23 నుంచి 25వ తేదీ వరకు న్యాక్ బృందం పరిశీలించనుందని వీసీ జి.ఎన్.శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. అందుకు సంబంధించి ఆయా విభాగాల్లో అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. గతంలో బీ కేటగిరిలో ఉన్న యూనివర్సిటీని ఏ కేటగిరిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.
కందులు క్వింటాల్ రూ.6,996
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో గురువారం కందులు క్వింటాలు గరిష్టంగా రూ.6,996, కనిష్టంగా రూ.6019 ధరలు పలికాయి. అలాగే వేరుశనగ గరిష్టంగా రూ.6,569, కనిష్టంగా రూ.4,389, మొక్కజొన్న రూ.2,225, ధాన్యం ఆర్‌ఎన్‌ఆర్ రూ.2,580 ధరలు లభించాయి.
Comments
Please login to add a commentAdd a comment