పెండింగ్ పనులు పూర్తి చేయాలి
భూత్పూర్: మండలంలోని మద్దిగట్ల, కొత్తూర్ గ్రామాల్లో అసంపూర్తి ఉన్న డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం పనులు వెంటనే పూర్తి చేయాలని కాంట్రాక్టర్ బాబును ఎమ్మెల్యే జి. మధుసుదన్‌రెడ్డి ఆదేశించారు. మంగళవారం మద్దిగట్లలోని డబుల్‌బెడ్‌రూం ఇళ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. ఇటీవల మద్దిగట్లలో డబుల్ బెడ్‌రూం ఇళ్లకు సంబంధించి రూ.2.60 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించినట్లు తెలిపారు. రెండు గ్రామాల్లో పెండింగ్ పనులు పూర్తి చేస్తే వాటి బిల్లులు ఇప్పిస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆయన వెంట కేసిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, తమ్మన్న గౌడ్, వెంకటేష్, లక్ష్మికాంత్‌రెడ్డి, వడ్డె శ్రీను, నారాయణరెడ్డి, తదితరులు ఉన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
జడ్చర్ల టౌన్: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాసంస్థలో ఐదో తరగతిలో ప్రవేశం కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలని చిట్టెబోయిన్‌పల్లి పాఠశాల ప్రిన్సిపాల్ అనిత్ బుధవారం ఓ ప్రకటనలో సూచించారు. ఈ నెల ఒకటో తేదీ వరకు కులం, ఆదాయం, ఆధార్‌నంబర్, బర్త్ సర్టిఫికెట్, పాస్‌ఫొటోతో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
‘వ్యవసాయ కార్మికులకు రూ.12 వేలు ఇవ్వాలి’
మహబూబ్‌నగర్ న్యూటౌన్: భూమిలేని వ్యవసాయ కార్మికులందరికీ రూ.12 వేలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ ని అమలు చేయాలన్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా వంద రోజులు పనిపొందిన కుటుంబాల ఆధార్‌కార్డు, పట్టాదారు పాస్‌బుక్ ఆధారంగా రూ.12 వేలు ఇవ్వాలన్నారు. గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేయాలని కోరారు. ఎవరెవరికి ఎలా ఇస్తారనే దానిపై విధివిధానాలు ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో సంఽఘం జిల్లా ప్రధానకార్యదర్శి కడియాల మోహన్, జిల్లా ఉపాద్యక్షుడు హనుమంతు, నాయకులు రఘు, రాములు, తదితరులు పాల్గొన్నారు.
పథకాలపై క్షేత్రస్థాయి పరిశీలన: ఆర్‌డీఓ
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే అమలు చేయనున్న వివిధ పథకాలపై పట్టణ పరిధిలోని 49 వార్డులలో ఈనెల 16 నుంచి 20వ తేదీ వరకు క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టాలని ఆర్‌డీఓ నవీన్ ఆదేశించారు. బుధవారం రాత్రి స్థానిక మున్సిపల్ కౌన్సిల్ సమావేశ మందిరంలో వార్డు ఆఫీసర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐదు రోజుల పాటు కొత్త రేషన్ కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల వివరాలను మరోసారి క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. ఈ పథకాలకు అర్హుల జాబితాను జాగ్రత్తగా రూపొందించాలన్నారు. సమావేశంలో మహబూబ్‌నగర్ అర్బన్ తహసీల్దార్ ఘాన్సీరాంనాయక్, మున్సిపల్ కమిషనర్ డి.మహేశ్వర్ రెడ్డి, ఆర్‌ఓ మహమ్మద్‌ఖాజా తదితరులు పాల్గొన్నారు.
విజయంతో తిరిగి రావాలి
మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ: చైన్నెలో ఆరు రోజుల పాటు కొనసాగే అఖిల భారత దక్షిణ ప్రాంత పోటీలకు పీయూ క్రికెట్ జట్టు (పురుషుల) బుధవారం బయలుదేరింది. అంతకుముందు క్రీడాకారులకు వైస్ చాన్స్‌లర్ జి.ఎన్.శ్రీనివాస్ ట్రాక్‌సూట్, క్రికెట్ యూనిఫాం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 16 నుంచి 21వ తేదీ వరకు తమిళనాడులోని యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచి విజయంతో తిరిగి రావాలని, పాలమూరు యూనివర్సిటీకి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపాల్ డా.బషీర్‌అహ్మద్, సీనియర్ అధ్యాపకులు డా.అర్జున్‌కుమార్, పీడీలు వెంకట్‌రెడ్డి, శ్రీనివాస్, క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి సురేష్, కోచ్‌లు అబ్దుల్లా, అబిద్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment