ఇచ్చిన డబ్బులు అడిగితే ప్రాణం తీశారు
కోస్గి: పండుగ దావత్ పేరుతో తప్పతాగిన నలుగురు స్నేహితులు గతంలో అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వాలని అడగడంతో తాగిన మైకంలో తోటి స్నేహితుడనే విషయం మరిచిపోయి మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సదరు వ్యక్తి మృతిచెందిన సంఘటన నారాయణపేట జిల్లా గుండుమాల్ మండలంలోని భక్తిమళ్లలో చోటుచేసుకుంది. వివరాలిలా.. గ్రామానికి చెందిన రాములు(40) స్థానికంగా ఓ డైరీ ఫాంలో పనిచేసుకుంటూ తన ముగ్గురు పిల్లలు, తల్లిని పోషించుకుంటున్నాడు. అదే గ్రామానికి చెందిన అతని స్నేహితులు కృష్ణ, అంజి, పురుషోత్తం సంక్రాంతి పండుగ నేపథ్యంలో దావత్ చేసుకుందామని ఈ నెల 15న రాములుతో కలిసి గ్రామ శివారులోని వాగులోకి వెళ్లారు. కాగా గతంలో రాములు భార్య దగ్గర కృష్ణ రూ.5 వేలు అప్పు తీసుకున్నాడు. రాములు భార్య ఆరు నెలల క్రితమే అనారోగ్యంతో మృతిచెందింది. నా భార్య చనిపోయి ఆరు నెలలైన తీసుకున్న అప్పు ఇంకా ఇవ్వలేదన్నాడు. పండుగ దావత్‌లో పాత అప్పు అడగడం సరికాదని మిగిలిన ఇద్దరు స్నేహితులు సైతం రాములుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గొడవ పెద్దగా మారడంతో ముగ్గురు కలిసి రాములుపై కర్రతో దాడి చేశారు. దెబ్బలకు స్పృహ కోల్పోయిన రాములును ముగ్గురు స్నేహితులు బైక్‌పై ఎక్కించుకొని గ్రామంలోకి వచ్చి.. మందు ఎక్కువైందని కుటుంబ సభ్యులను నమ్మించి అతని ఇంట్లోనే దుప్పటి కప్పి పడుకోబెట్టి వెళ్లిపోయారు. అతని తల్లి, పిల్లలు గమనించకపోవడంతో నిద్రలోనే రాములు మృతి చెందాడు. గురువారం ఉదయం నిద్రలేపేందుకు ప్రయత్నించగా అసలు విషయం బయట పడింది. రక్త గాయాలు గుర్తించి గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో అతన్ని ప్రైవేట్ వాహనంలో కోస్గి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు నిర్ధారించారు. కాగా ఈ విషయంలో ఎలాంటి కేసు నమోదు కాకుండా గ్రామంలో కొందరు పెద్దలు శవ పంచాయితీ నిర్వహించి బాధిత కుటుంబానికి రూ.3 లక్షలు చెల్లించాలని నిర్ణయించినప్పటికీ విషయం బయటకు పొక్కడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పండుగ దావత్ అంటూ వాగులో స్నేహితుల మందు పార్టీ
గతంలో ఇచ్చిన పాత అప్పు అడగడంతో ఆగ్రహం
కర్రతో కొట్టడంతో రక్త గాయాలు
ఎవరూ పట్టించుకోకపోవడంతో నిద్రలోనే మృతి
నారాయణపేట జిల్లా
భక్తిమళ్లలో విషాదం
అనాథలైన ముగ్గురు పిల్లలు
రాములు గతంలో భార్య సువర్ణ, ముగ్గురు పిల్లలతో కలిసి హైదరాబాద్‌లో కూలీ పనులతో జీవనం సాగించేవాడు. భార్య సువర్ణకు క్యాన్సర్ రావడంతో భార్య చికిత్స కోసం అప్పులు చేశాడు. వ్యాధి నయం కాకపోవడంతో భార్య ఆరు నెలల క్రితమే మృతిచెందింది. గ్రామంలోనే ఓ వ్యక్తి డైయిరీ ఫాంలో పనిచేస్తూ తన ముగ్గురు పిల్లలు, తల్లిని పోషించుకుంటున్నాడు. తాజాగా స్నేహితుల దాడిలో రాములు సైతం మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. అనారోగ్యంతో తల్లిని, దాడిలో తండ్రిని కోల్పోయిన ముగ్గురు పిల్లలు జానకి, పావని, అఖిల్ అనాథలుగా మారారు. ఓ పక్క శవ పంచాయతీ కొనసాగుతుండగా మరోపక్క పిల్లలతో కలిసి రాములు తల్లి మొగులమ్మ చేసిన రోదనలు పలువురిని కంటతడి పెట్టించాయి. ఈ ఘటనపై రాములు తల్లి మొగులమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ బాలరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment