రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
లింగాల: మండల కేంద్రం నుంచి దారారం వెళ్లే మార్గంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఎస్‌ఐ నాగరాజు వివరాల మేరకు.. దారారం గ్రామానికి చెందిన గుర్రాల బొజ్జయ్య (55) లింగాల నుంచి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. అదుపుతప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీకొట్టాడు. ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని 108 అంబులెన్స్‌లో అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యంలో మృతి చెందాడు. మృతుడికి భార్య అలివేల, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. మృతుడి కుమారుడు గుర్రాల శ్రీశైలం ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
దుందుభీ వాగులో
తేలిన యువకుడి శవం
● వారం రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదు
ఉప్పునుంతల: మండలంలోని మొల్గరకు చెందిన కుంటల భిక్షపతి (35) అనే యువకుడు గురువారం ఉదయం గ్రామ సమీపంలోని దుందుభీ వాగులో శవమై తేలాడు. ఘటనకు సంబంధించి ఎస్‌ఐ వెంకట్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడు భిక్షపతి ఈనెల 9న ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని అతడి తండ్రి జంగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 10వ తేదీన మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గురువారం ఉదయం గ్రామ సమీపంలోని దుందుభీ వాగులోని పందిబండ ప్రాంతంలో వ్యక్తి శవం ఉన్నట్లు గ్రామస్తులు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు అక్కడికి వెళ్లి చూడగా.. అది భిక్షపతి శవమే అని కుటుంబ సభ్యులు గుర్తించారు. పంచనామా నిర్వహించి శవాన్ని అచ్చంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. వాగులో నీరు తక్కువ లోతులో పారుతూ మనిషి మునిగిపోయి చనిపోయే పరిస్థితి లేనందున అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య శోభతో పాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
రైలు కిందపడి మహిళ ఆత్మహత్య
మహబూబ్‌నగర్ క్రైం: రైలు కిందపడి గుర్తుతెలియని మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు రైల్వే ఎస్‌ఐ సయ్యద్ అక్బర్ తెలిపారు. వివరాలు.. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని టీడీగుట్ట రైల్వేగేట్ సమీపంలో గురు వారం రాత్రి 7.30ప్రాంతంలో గుర్తు తెలియని మహిళ(35) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. రైలు వస్తున్న విషయాన్ని గమనించి పరుగెత్తుకుంటూ వెళ్లి రైలు కిందపడటంతో తీవ్రగాయాలు కాగా అక్కడిక్కడే మృతి చెందింది. మృతురాలి దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని మృతురాలికి సంబంధించిన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే రైల్వే పోలీసులను సంప్రదించాలన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment