రోడ్డు ప్రమాద బాధితుల ఆందోళన
కల్వకుర్తి టౌన్: మండలంలోని వేపూర్‌గేటు వద్ద బుధవారం జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందిన బంగారయ్య (39), మహేష్ (35) కుటుంబసభ్యులు, బంధువులు న్యాయం చేయాలంటూ గురువారం పట్టణంలోని పాలమూరు చౌరస్తాలో ఆందోళన చేపట్టారు. వీరికి ఎమ్మార్పీఎస్ నాయకులు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఇద్దరి మృతికి కారణమైన కారు యజమానిని తమ ముందుకు తీసుకురావాలని పట్టుబట్టారు. పోలీసులు అతడిని వెనకేసుకొస్తున్నారని.. అజాగ్రత్తతోనే ప్రమాదం జరిగిందని ఆరోపించారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగే వరకు నిరసన కొనసాగిస్తామంటూ, మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వ హించకూడదని రోడ్డుపై బైఠాయించారు. ఫిర్యాదు అందితే తప్పా పోస్టుమార్టం నిర్వహించడానికి వీలుకాదని పోలీసులు చెబుతున్నారు.
ఎమ్మెల్యే హామీతో..
ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అక్కడకు చేరుకొని బాధిత కుటుంబాలను పరామర్శించారు. న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ కూడా బాధిత కుటుంబాలను పరామర్శించారు.
రాకపోకలకు అవస్థలు..
హైదరాబాద్ చౌరస్తాలో లారీ బోల్తా, పాలమూరు చౌరస్తాలో బాధిత కుటుంబీకుల నిరసనతో రెండు ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ జాం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. కాలనీల్లోని ఇరుకు రోడ్ల మీదుగా రాకపోకలు సాగించారు.
కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలోనే మృతదేహాలు
న్యాయం జరిగే వరకు పోస్టుమార్టం వద్దన్న కుటుంబీకులు
Comments
Please login to add a commentAdd a comment