‘స్థానిక’ సమరానికి సై
జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): ఎంపీటీసీ, జెడ్పీటీసీ (స్థానిక సంస్థల) ఎన్నికల సమరానికి ప్రభుత్వ యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారనేది స్పష్టంగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించనప్పటికీ ఎన్నికల సామగ్రి పంపిణీ చేస్తున్నారు. ఏ క్షణాన్నైనా ఎన్నికల నోటిఫికేషన్ వెలువడవచ్చనే సంకేతాలు దీని ద్వారా తెలుస్తోంది. మండల పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ(ఎంపీటీసీ), జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజవర్గాల(జెడ్పీటీసీ) ఎన్నికలను జిల్లా పరిషత్‌ల ద్వారా రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది. ఈక్రమంలో జిల్లాపరిషత్‌కు మెటీరియల్ సరఫరా చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులపై జరుగుతాయి. అందుకు అవసరమైన కవర్లు, బ్యాలెట్ పత్రాలకు సంబంధించిన పేపర్, ఎన్నికల నియమావళికి, మార్గదర్శకాల కరదీపికలు నాలుగు రోజుల క్రితమే జెడ్పీకి చేరుకున్నాయి. కాగా.. ఎన్నికలకు సంబంధించిన సామగ్రిని గురువారం జిల్లాలోని ఆయా మండలాలకు పంపిణీ చేశారు. ఎన్నికల్లో విధులు నిర్వహించే సిబ్బందికి శిక్షణ నుంచి ఎన్నికల కౌంటింగ్ వరకు అవసరమయ్యే అన్ని రకాల సామగ్రిని జిల్లా పరిషత్ సూపరింటెండెంట్ శ్రీహరి సమక్షంలో ఆయా మండలాల అధికారులకు అందజేశారు.
పునర్విభజనతో మారిన జిల్లాలు
జిల్లాల పునర్విభజనతో ఉమ్మడి జిల్లాలో నాగర్‌కర్నూల్, మహబూబ్‌నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలుగా ఏర్పాటయ్యాయి. గత స్థానిక సంస్థల ఎన్నికలు ఈ జిల్లాల ప్రాతిపదికన జరిగాయి. మహబూబ్‌నగర్ జిల్లా పరిషత్ పరిధిలో 14 మండలాలు ఉన్నాయి. ఇటీవల రెండు కొత్త మండలాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 441 గ్రామ పంచాయతీలు ఉండగా జెడ్పీటీసీలు 16 ఉంటాయి. 184 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. 898 పోలింగ్ కేంద్రాలను ఇప్పటికే అధికారులు గుర్తించారు.
పంచాయతీరాజ్ చట్టంలో మార్పు
గత ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు ప ర్యాయాలకు రిజర్వేషన్లు అమలయ్యేలా చట్టం చేసింది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి పంచాయతీరాజ్ చట్టంలో మార్పు చేసింది. రిజర్వేషన్లు ఒక పర్యాయానికి వర్తించేలా మార్పులు చేసి నట్లు సమాచారం. ఈక్రమంలో ముందుగా ప్రాదే శిక నియోజకవర్గాల వారీగా జెడ్పీ చైర్‌పర్సన్లు, మండల పరిషత్ అధ్యక్షుల రిజర్వేషన్లు ఖరారైతే రా జకీయ ముఖచిత్రం అర్థం అవుతుంది. ఆశావహు లు మాత్రం రిజర్వేషన్లు కలిసి వస్తే ఎలాగైనా పోటీ చేయాలనే ఆసక్తితో రాజకీయ పెద్దలను ప్రసన్నం చేసుకుంటున్నారు. పోలింగ్ బూత్‌ల పరిశీలన కు ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై స్పష్టత వస్తుంది.
ఆశావహుల సమాయత్తం
రాష్ట్ర ఎన్నికల కమిషన్ జిల్లాలకు ఎన్నికల సామగ్రి పంపిస్తున్నట్లు ప్రచారం కావడంతో రాజకీయ పార్టీలు, ఆశావహులు ఎన్నికలకు సమాయత్తమవుతున్నారు. పార్టీల వారీగా జరగనున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు పార్టీల అగ్రనాయకుల మెప్పు కోసం తాపత్రయపడుతున్నారు. టికెట్ దక్కించుకునేందుకు నియోజకవర్గ ఇన్‌చార్జీల దృష్టిని ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు అధికార పార్టీ స్థానికసంస్థలను పూర్తిస్థాయిలో కై వసం చేసుకోవాలని ఇప్పటి నుంచే నాయకులకు సూచనలు చేసింది. మరోవైపు విపక్షాలు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఎలాగైనా స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని ప్రణాళికతో ముందుకుపోతున్నాయి.
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు
కసరత్తు చేస్తున్న అధికారులు
898 పోలింగ్ కేంద్రాల గుర్తింపు
మండలాలకు ఎన్నికల సామగ్రి అందజేత
ఎన్నికల సామగ్రి వచ్చింది
ఎన్నికల సామగ్రి జిల్లాపరిషత్‌కు వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం ఎన్నికల ప్రక్రియను పూర్తిచేస్తున్నాం. ఇప్పటికే పోలింగ్‌స్టేషన్లు ఎంపిక చేయడంతో పాటు మరో 10 శాతం అదనంగా ఎంపిక చేసి ఉంచాం. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉన్నాం.
–వెంకట్‌రెడ్డి, జెడ్పీ సీఈఓ, మహబూబ్‌నగర్
Comments
Please login to add a commentAdd a comment