ఆరోగ్యప్రదాయిని
గానుగ తిప్పుతున్న దృశ్యం
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: వారిద్దరు ప్రాణస్నేహితులు. రామకృష్ణ మఠంలో వలంటీర్లుగా పనిచేశారు. తన తల్లి ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఒకరు.. రాజీవ్ దీక్షిత్‌ల ప్రసంగాలతో మరొకరు.. ఇలా ఇద్దరూ కలిసి గానుగ నూనె తయారీకి శ్రీకారం చుట్టారు. తొలుత తమ ఇంటి వరకే అనుకున్న వారు.. ప్రజలకు ఆరోగ్యపరంగా మేలు చేయాలనే లక్ష్యంతో విస్తరించారు. ఆరోగ్యప్రదాయిని పేరుతో గానుగ నూనె తయారు చేస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. మారుమూల పల్లె నుంచి విదేశాలకు ఎగుమతి చేసే వరకు ఎదిగిన మహబూబ్‌నగర్ జిల్లా గండేడ్ మండలంలోని జక్లపల్లి గ్రామానికి చెందిన కోట్ల శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజ్ విజయగాధపై ప్రత్యేక కథనం..
తల్లి ఆరోగ్యం కోసం...
కోట్ల శ్రీనివాస్‌రెడ్డి తల్లి కోట్ల జయమ్మకు 2018లో రొమ్ము కేన్సర్ వచ్చింది. హైదరాబాద్‌లోని బసవతారకం ఆస్పత్రిలో చూపించారు. పదిసార్లు కీమోథెరపీ చేయాలని డాక్టర్లు సూచించగా.. రెండుసార్లు చేయించారు. ఈ క్రమంలో ఆయుర్వేద మందులతో నయమవుతుందని పలువురు చెప్పడంతో కీమోథెరపీ వదిలేసి కర్ణాటక రాష్ట్రంలోని మైసూర్‌కు వెళ్లి ప్రముఖ ఆయుర్వేద వైద్యుడు ఖాదర్‌వలీని కలిశారు. కేన్సర్‌కు కల్తీ నూనెల వాడకమే ప్రధాన కారణమని.. వాటిని మానేసి గానుగ నూనె వాడాలని, దీంతోపాటు చిరుధాన్యాలు తీసుకోవాలని ఆయన సూచించారు. మైసూర్‌లో నూనె గానుగలు ఉన్నాయని, వాటిని ఒక్కసారి చూడాలని చెప్పడంతో శ్రీనివాస్‌రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
సిరులు కురిపిస్తున్న గానుగ నూనె
● ఆరోగ్యానికి మేలుచేకూరుస్తుండటంతో పెరుగుతున్న డిమాండ్
● 9 గానుగల ద్వారా నెలకు 3 వేల కిలోల దాకా ఉత్పత్తి
● మారుమూల జక్లపల్లి నుంచి విదేశాలకు సైతం ఎగుమతి
● అందరి మన్ననలు అందుకుంటున్నకోట్ల శ్రీనివాస్‌రెడ్డి, బస్వరాజ్
ఇంటి వరకే అనుకునిప్రారంభించాం..
అప్పట్లో అమ్మ ఆరోగ్యం బాగలేదు. వైద్యుడు ఖాదర్‌వలీ సూచనతో గానుగ నూనె వాడాలనుకున్నా. తొలుత ఇంటి వరకు తయారు చేయాలనుకుని ఒక్క గానుగతో ప్రారంభించాం. అమ్మ ఆరోగ్యం కుదుటపడడం.. గానుగ నూనెకు డిమాండ్ పెరగడంతో ప్రైవేట్ టీచర్ జాబ్ వదిలేసి దీనిపైనే దృష్టిపెట్టా. విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి ఎదగడం సంతోషంగా ఉంది.
– కోట్ల శ్రీనివాస్‌రెడ్డి,
గానుగ నూనె తయారీదారుడు
అందరికీ అందుబాటులోకి..
ప్రజల ఆరోగ్యం కోసం స్వచ్ఛమైన గానుగ నూనె తయారు చేయాలని సంకల్పించి.. చిన్నగా ప్రారంభించాం. డిమాండ్ పెరగడంతో అందరికీ అందుబాటులోకి తేవాలనుకున్నాం. ఏపీ, తెలంగాణతోపాటు తమిళనాడు, మహారాష్ట్ర, జార్ఖండ్, పంజాబ్ తదితర రాష్ట్రాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహించారు. యూనిట్ నిర్వహణ, రుణ సౌకర్యం, మార్కెటింగ్ వంటి అంశాలపై 1,200 మందికి శిక్షణ ఇచ్చాం. ఆయా రాష్ట్రాల్లో 250 గానుగలు ఏర్పాటుకు కృషిచేశాం.
– బస్వరాజ్, గానుగ నూనె తయారీదారుడు
గానుగ ద్వారా ఒక్కకిలో నూనె తయారీకి మూడు కిలోల పల్లీలు గానీ, కుసుమలు గానీ అవసరం. ఈ మేరకు వివిధ రకాల నూనెలను గానుగ ద్వారా తీసేందుకు అవసరమైన ముడి సరుకులకు వివిధ రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. ప్రతినెలా 6టన్నుల పల్లీలు, 2 టన్నుల కొబ్బరి, 3 టన్నుల కుసుమ, 2టన్నుల నువ్వులు అవసరమవుతాయని నిర్వాహకులు తెలిపారు. వీటిలో గడ్డి నువ్వులు ఒడిశా.. కుసుమ, కొబ్బరి కర్ణాటక.. పల్లీలు, నువ్వులను మహబూబ్‌నగర్ నుంచి దిగుమతి చేసుకుంటున్నట్లు వెల్లడించారు.
విదేశాలకు ఎగుమతి..
గానుగల ద్వారా తీసిన వివిధ రకాల నూనెలను మొదట స్థానికంగా విక్రయించిన వీరు.. హైదరాబాద్‌లోని ఓ సంస్థ సహకారంతో విదేశాలకు రవాణా చేస్తున్నారు. ప్రతి మూడు నెలలకోసారి దాదాపు 4 వేల కిలోల మేర నూనెను దుబాయ్, సింగపూర్, మలేషియా వంటి దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఢిల్లీ, హరియాణా తదితర రాష్ట్రాలకు కొరియర్ ద్వారా సైతం గానుగ నూనె సరఫరా చేస్తున్నారు. రకాన్ని బట్టి ఒక్కో కిలోకు రూ.300 నుంచి రూ.450 వరకు రిటైల్, హోల్‌సేల్‌గా విక్రయిస్తున్నారు. గానుగ తీసిన తర్వాత వచ్చే పిప్పిని పశువుల దాణా కోసం విక్రయిస్తున్నారు. దీనికి స్థానికంగా గిరాకీ ఉండగా.. కిలోకు రూ.40 చొప్పున ధర పలుకుతోంది.
ఒడిశా, కర్ణాటక నుంచి..
Comments
Please login to add a commentAdd a comment