బ్రహ్మాండంగా మన్యంకొండ అభివృద్ధి
మహబూబ్‌నగర్ రూరల్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మన్యంకొండను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి పాలక మండలి నూతన డైరెక్టర్ల ప్రమాణ స్వీకారానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మన్యంకొండ దేవస్థానం అభివృద్ధికి రూ.130 కోట్ల అంచనాతో పనులు చేపట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఇప్పటికే దేవస్థానం ట్రస్ట్ చైర్మన్‌తోపాటు దేవాదాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారని, వాటి ఆధారంగా పనులు చేపట్టేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సుముఖత వ్యక్తం చేశారన్నారు. మరో రెండు, మూడు రోజుల్లో మరోసారి ఆలయాన్ని సందర్శించి భక్తులకు అవసరమైన మరిన్ని సౌకర్యాల గురించి చర్చించి వాటి కల్పన కోసం కృషి చేస్తానన్నారు. భక్తులకు ఎలాంటి సౌకర్యాలు గుర్తించి అందించే దిశగా ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. మన్యంకొండ జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివస్తారని, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. గతేడాది సమయభావంతో దేవస్థానం నియమించిన ఉత్సవ కమిటీనే ఇప్పుడు పాలక మండలి డైరెక్టర్లుగా నియమించారన్నారు. అనంతరం మన్యంకొండ దేవస్థానం వారి నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. అంతకుముందు ఎమ్మెల్యే స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి.. వేద ఆశీర్వాదం అందించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నర్సింహారెడ్డి, మున్సిపల్ చైర్మన్ ఆనంద్‌గౌడ్, ముడా చైర్మన్ లక్ష్మణ్‌యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత, వైస్ చైర్మన్ విజయ్‌కుమార్, దేవస్థానం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు, సూపరింటెండెంట్ నిత్యానందచారి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment