సమగ్ర పరిశీలన తర్వాతే లబ్ధిదారుల ఎంపిక
జెడ్పీసెంటర్ (మహబూబ్‌నగర్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు జారీ, ఇందిరమ్మ ఇళ్ల పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికకు సమగ్ర పరిశీలన చేయాలని కలెక్టర్ విజయేందిర అన్నారు. లబ్ధిదారుల ఎంపికపై నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి పరిశీలనపై శనివారం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి అధికారులతో వెబెక్స్ ద్వారా సమీక్షించారు. రైతు భరోసా కార్యక్రమం కింద వ్యవసాయ యోగ్యమైన భూమి, రేషన్ కార్డుల వెరిఫికేషన్‌పై క్షేత్రస్థాయి పరిశీలన మండలాల వారీగా ఎంపీడీఓలు, తహసీల్దార్లతో సమీక్షించి సూచనలు చేశారు. ఇప్పటి వరకు ఎన్ని రెవెన్యూ గ్రామాలు పూర్తి చేశారు.. ఇంకా ఎన్ని గ్రామాలు పూర్తి చేయాల్సి ఉంది.. రేషన్ కార్డుల వెరిఫికేషన్ ఎంత వరకు వచ్చింది.. ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆరాతీశారు. అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలన్నారు. లబ్ధిదారుల ఎంపికలో అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. రైతు భరోసాలో భాగంగా వ్యవసాయ శాఖతో రెవెన్యూ అధికారులు సమన్వయం చేసుకుని సాగుకు యోగ్యం కాని భూములను, గుట్టలు, వెంచర్లు, భూసేకరణలో భాగంగా ప్రాజెక్టులు, చెరువులు, కాల్వలు, రహదారుల కోసం తీసుకున్న భూముల వివరాలు జాబితాలో ఉండకూడదన్నారు. సాగుకు యోగ్యమైన భూముల జాబితా క్షేత్రస్థాయిలో పరిశీలించాలని చెప్పారు. రేషన్ కార్డుల కోసం సమగ్ర కుటుంబ సర్వేలో వచ్చిన దరఖాస్తుదారుల పూర్తి వివరాలు పరిశీలించి.. అర్హుల జాబితా రూపొందించాలని ఆదేశించారు. ఈ నెల 16 నుంచి నిర్వహిస్తున్న క్షేత్రస్థాయి పరిశీలనలో ఇంకా మిగిలిన గ్రామాలను సోమవారం వరకు పూర్తి చేయాలన్నారు. లబ్ధిదారుల జాబితా ఈ నెల 21 నుంచి 24 వరకు జరిగే గ్రామసభలలో నాలుగు పథకాల లబ్ధిదారుల పేర్లను వివరించాలని, అలాగే లబ్ధిదారుల పేర్లను కూడా ప్రదర్శించాలని చెప్పారు. గ్రామసభలో ఆమోదం పొందిన తర్వాత అర్హుల జాబితా రూపొందించాలని, అభ్యంతరాలు ఉంటే గ్రామసభలో స్వీకరించాలని సూచించారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసాపై ప్రభుత్వం మార్గదర్శకాలు వివరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు శివేంద్ర ప్రతాప్, మోహన్‌రావు, డీఆర్‌డీఓ నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందిస్తామని, ఇదొక నిరంతర ప్రక్రియ అని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి ఆయా పథకాల అమలుపై కలెక్టర్లతో వీసీ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ అర్హులైన చిట్ట చివరి వ్యక్తికి పథకాలు అందజేసేందుకు కృషిచేస్తామన్నారు. ఇప్పుడు కొత్త రేషన్ కార్డుల జాబితాలో పేర్లు రాని వారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, కుల, సామాజిక, ఆర్థిక సర్వే, పాత రేషన్ కార్డుల ఆధారంగా పేర్లు నమోదు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment