అధికారులకు అసైన్డ్ ఉచ్చు!
● సర్వే నంబర్ ‘324’లో క్రయ విక్రయాలపై నివేదిక ● ఓ సబ్ రిజిస్ట్రార్, సీనియర్ అసిస్టెంట్‌కు చిక్కులు ● గత రికార్డులు స్పష్టంగా లేక ఇష్టారీతిన రిజిస్ట్రేషన్లు
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: ‘అసైన్డ్’ భూమిలో జరిగిన లావాదేవీలపై రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్లకు ఉచ్చు బిగుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని ఏసీసీ, ప్రస్తుత శ్రీనివాస కాలనీలో సర్వే నంబర్ 324లో వివాదంపై విచారణ జరుగుతన్న విషయం తెలిసిందే. ఇక్కడ ఓ మాజీ సైనికుడికి కేటాయించిన భూమిలో వారసుల మధ్య వివాదంలో అప్పటి రెవెన్యూ, ఇద్దరు సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్లకు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలున్నాయి. ఈ వివాదంపై విచారణ నేపథ్యంలో ఈ సర్వే నంబరులో గతేడాదిగా జరిగిన లావా దేవీల వివరాలు తీసుకోవాలని కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మొదట సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు స్పందించలేదు. దీంతో మంచిర్యాల మండల రెవెన్యూ అధికారులు గట్టిగా అడగడంతో చివరకు ఆ రిజిస్ట్రేషన్లు చేసిన అధికారుల పేర్లు వెల్లడించారు. ఆ వివరాలు తాజాగా కలెక్టర్‌కు నివేదించారు. బాధ్యులైన ఓ సబ్ రిజిస్ట్రార్, సీనియర్ అసిస్టెంట్‌పై చర్యలకు కలెక్టర్ సిఫారసు చేసే అవకాశం ఉంది. తండ్రి నుంచి సంక్రమించిన అసైన్డ్ భూమిని ఇద్దరు అన్నదమ్ములకు వాటాలను ఒకరి వారసత్వం, మరొకరికి సాదాబైనామాలో అమ్మినట్లు కాగితాలు చూపి అధికారులు రికార్డుల కు ఎక్కించారు. ఈ అసైన్డ్ భూమిలో క్రయ విక్రయాలతోపాటు, తప్పుదోవపట్టించిన అప్పటి వీఆర్వోలు, క్షుణ్ణంగా పరిశీలించకుండా ధ్రువీకరించిన నాటి తహసీల్దార్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
స్పష్టత లేక సమస్య
జిల్లా కేంద్రలోని శ్రీనివాస కాలనీ, ఏసీసీ సమీపంలో ఉన్న ప్రభుత్వ భూమి 324 సర్వే నంబరు పాత రికార్డులు గందర గోళంగా ఉన్నాయి. దీంతో ఏళ్లుగా ఈ రికార్డులపై స్పష్టత లేకపోవడంతో ఇంకా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రస్తుతం ధరణి, పాత రికార్డుల ప్రకారం వేర్వేరుగా ఉండడంతో అస్పష్టత కొనసాగుతోంది. విజిలెన్స్ విచారణతోపాటు ఉన్నతాధికారుల సమక్షంలోనూ సర్వేలు జరిగాయి. తాజాగా ఇద్దరు వారసుల మధ్య వివాదంతోనూ అటు సబ్ రిజిస్ట్రార్, ఇటు రెవెన్యూ అధికారుల తప్పిదాలు బయటపడ్డాయి.
వాగు పరిధి 12.04 ఎకరాలు
సర్వే నంబరు 324 మొత్తం 117 ఎకరాలు విస్తీర్ణం ఉంది. ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఎక్కించారు. ఫిర్యాదుల తర్వాత విచారణ సందర్భంగా పాత రికార్డులను పరిశీలించారు. ఇందులో 60 ఎకరాలు జంగ్‌సిపాయికి చెందిన భూమి, 10.25 ఎకరాలు ఏసీసీ భూ సేకరణలో తీసుకుంది. మిగతాది మరో తొమ్మిది మందికి అసైన్డ్ చేసింది. ఇందులో వాగు పరిధిలోనే 12.04 ఎకరాలు ఉన్నట్లు రెవెన్యూ అధికారులే ధ్రువీకరించారు. అసైన్డ్ భూమి పోను మిగతా 22.29 ఎకరాల్లో ఎక్కడా ఖాళీ లేకుండా రికార్డుల్లో ఉంది. ఈ విస్తీర్ణంపై స్పష్టత లేకపోవడంతోనే ఇప్పటికీ అదే గందరగోళం కొనసాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment