మద్యం మత్తులో కిందపడి ఒకరు..
భైంసాటౌన్: మద్యం మత్తులో కిందపడి ఒకరు మృతి చెందిన సంఘటన పట్టణంలో చోటు చేసుకున్నట్లు ఎస్సై మహమ్మద్ గౌస్ తెలిపారు. పట్టణంలోని గుజిరిగల్లికి చెందిన జాదవ్ గణేశ్ (27) లేబర్ పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసయ్యాడు. శనివారం ఉదయం భట్టిగల్లిలోని మున్నూరుకాపు సంఘం భవనం వద్ద కిందపడి ఉండడం గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. మద్యం మత్తులో కిందపడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. మృతుని తండ్రి బాబురావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
ఒంటరితనం భరించలేక ఆత్మహత్య
భైంసారూరల్: ఒంటరితనం భరించలేక ఉరేసుకుని ఒకరు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్సై మాలిక్ తెలిపిన వివరాల మేరకు మండలంలోని సుంక్లి గ్రామానికి చెందిన ఆది రాజేందర్ (37)కు ఆరేళ్ల క్రితం భార్యతో విడాకులయ్యాయి. అప్పటి నుంచి ఒంటరిగానే ఉంటున్నాడు. ఒంటరితనం భరించలేక మానసికంగా కృంగిపోయాడు. శుక్రవారం రాత్రి ఇంటిముందున్న రేకుల షెడ్డులో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
ఆర్థిక ఇబ్బందులతో ఆటోడ్రైవర్..
శ్రీరాంపూర్: ఆర్థిక ఇబ్బందులతో ఆటోడ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన నస్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగార్జున కాలనీలో చోటు చేసుకుంది. ఎస్సై సుగుణాకర్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కాలనీకి చెందిన గోనె సాయికుమార్ (35) భార్య పద్మకు జ్వరం రావడంతో ఈ నెల 30న మంచిర్యాలలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి అడ్మిట్ చేయించాడు. అదేరోజు సాయంత్రం ఇంటికి వెళ్లి వస్తానని చెప్పి ఆస్పత్రి నుంచి బయటకు వచ్చాడు. రాత్రి వరకూ రాకపోవడంతో పాటు భార్య ఫోన్ చేసినా ఎత్తలేదు. 31న ఉదయం కూడా ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో విషయాన్ని పద్మ సోదరుడు మల్లేశ్‌కు తెలిపింది. అతను రాత్రి ఇంటికి వచ్చి చూసే సరికి లోపల గడియపెట్టి ఉంది. పిలిచినా పలకకపోవడంతో కిటికీలోంచి తొంగిచూడగా ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించాడు. పోలీసులకు సమాచారం అందించడంతో శనివారం ఉదయం మృతదేహాన్ని కిందికి దించారు. ఆటో కిరాయిలు లేక ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతోనే ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని బావమరిది మల్లేశ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment