సోన్: మద్యం మత్తులో వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన జాప్రపూర్‌లో శనివారం చోటు చేసుకుంది.. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జాప్రపూర్ గ్రామానికి చెందిన బొద్దుకూరి రాంరెడ్డి (63) కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. శుక్రవారం రాత్రి మద్యం సేవించి బాత్రూంకు వెళ్లాడు. బాత్రూంలో ఉన్న క్లీనర్ తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. గమనించిన కుటుంబ సభ్యులు నిర్మల్‌లోని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమించి శనివారం మృతి చెందాడు. మృతుని కుమారుడు విజయ్‌కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు హెడ్ కానిస్టేబుల్ విజయ్‌కుమార్ తెలిపారు.
చికిత్స పొందుతూ యువకుడు..
ఖానాపూర్: గత నెల 27న పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించిన యువకుడు చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు పెంబి ఎస్సై హన్మాండ్లు తెలిపారు. పెంబి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఖానాపూర్ మండలం బావాపూర్ (ఆర్) గ్రామానికి చెందిన మల్లేశ్ (21) రెండేళ్లుగా మద్యానికి బానిసయ్యాడు. ఈ క్రమంలో సోమవారం మద్యం మత్తులో గుర్తు తెలియని పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు నిర్మల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుని తల్లి లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment