ఆదిలాబాద్‌టౌన్: లాటరీ తగిలిందని మాయమాటలు చెప్పి ఓ మహిళ వద్ద నుంచి రెండున్నర తులాల బంగారం ఎత్తుకెళ్లిన సంఘటన శనివారం జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. వన్‌టౌన్ సీఐ సునీల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన అనసూయ శనివారం ఉదయం కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి వాటర్ క్యూరింగ్ చేస్తుండగా అక్కడికి వచ్చిన ఓ వ్యక్తి తన భర్త పేరు చెప్పి ఇంటి నిర్మాణం కోసం సిమెంట్ కొనుగోలు చేసినందుకు లక్కీ కూపన్ వచ్చిందని చెప్పాడు. ఆ కూపన్ ద్వారా టీవీ, రిఫ్రిజిరేటర్, ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకునే అవకాశం ఉందని, ఇష్టం లేకపోతే వస్తువులకు బదులు రూ.లక్ష తీసుకోవచ్చన్నాడు. అతని మాటలు నమ్మడంతో షాపు వద్దకు రమ్మని ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లాడు. పట్టణంలోని పంజేషా మొహల్లా కాలనీలో రెండు సిమెంట్ షాపులను చూపించాడు. అందులో మూసి ఉన్న షాపు తమదని నమ్మబలికాడు. బహుమతులు అందించిన నిర్వాహకులకు బంగారం చూపించాలని ఆమె మెడలోని రెండున్నర తులాల బంగారాన్ని తీసుకెళ్లాడు. మూసి ఉన్న షాపు తెరిచిన తర్వాత విషయాన్ని ఆ షాప్ యజమానికి చెప్పడంతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశాడు. ఒక్కసారిగా కంగు తిన్న ఆమె మోసపోయానని గ్రహించి కన్నీరు మున్నీరయ్యింది. కుటుంబ సభ్యులకు చెప్పడంతో వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సీసీ ఫుటేజ్‌లో పరిశీలించగా నిందితుడు పల్సర్ బైక్‌పై వచ్చాడని, నల్లని టీ షర్టు, టోపీ ధరించినట్లు గుర్తించామని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment