రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి సమీపంలో రైలు కిందపడి గుర్తు తెలియని యువకుడు (25) ఆత్మహత్య చేసుకున్నాడు. జీఆర్‌పీ ఎస్సై మహేందర్ తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఎడమ చేతిపై లవ్ గుర్తు కలిగి దానిపై మామా అని ఇంగ్లిష్‌లో టాటూ ఉంది. ఎత్తు 5.5, నల్లని రంగు టీ షర్ట్, ఆష్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలోని మార్చూరిలో భద్రపరిచారు. పూర్తి వివరాలకు 8712658596, 9849058691 నంబర్లలో సంప్రదించాలని ఎస్సై సూచించారు.
గుండెపోటుతో ఎస్సై హఠాన్మరణం
జన్నారం: మంచిర్యాల జిల్లా జన్నారం మండల పోలీస్‌స్టేషన్‌లో రెండో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న తానాజీ నాయక్(60) మంగళవారం తెల్ల వారుజామున గుండెపోటుతో హఠాన్మరణం చెందారు. వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలం ఎందా గ్రామానికి చెందిన తానాజీనాయక్ 1982 బ్యాచ్ కానిస్టేబుల్‌గా ఎంపికయ్యారు. అనంతరం హెడ్‌కానిస్టేబుల్, ఏఎస్సైగా పదోన్నతి పొందారు. ఎస్సైగా పదోన్నతితో ఏడాదిపాటు జన్నారంలో రెండో ఎస్సైగా పనిచేశారు. తొమ్మిది నెలల క్రితం రామకృష్ణాపుర్, లక్సెట్టిపేట పోలీస్‌స్టేషన్లకు బదిలీ అయ్యారు. ఏడు నెలల క్రితం తిరిగి జన్నారం పోలీస్‌స్టేషన్‌కు బదిలీపై వచ్చారు. నవంబర్‌లో ఉద్యోగ విరమణ చేయాల్సి ఉండగా.. ఆ తర్వాత జన్నారం మండలం ఇందన్‌పల్లిలో ఇల్లు నిర్మించుకుని కుటుంబంతో నివాసం ఉండేందుకు భూమి కొనుగోలు చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం పోలీస్‌స్టేషన్ ఆవరణలోని క్వార్టర్‌లో నివాసం ఉంటున్నారు. ఇంట్లో నిద్రిస్తున్న తానాజీ నాయక్ మంగళవారం 2.30గంటల ప్రాంతంలో గుండెపోటుకు గురయ్యారు. మండల కేంద్రంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ చనిపోయారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. స్వగ్రామంలో నిర్వహించిన అంత్యక్రియల్లో ఎస్సై రాజవర్ధన్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
పేకాట రాయుళ్ల అరెస్ట్
మంచిర్యాలక్రైం: జిల్లా కేంద్రంలోని సాయికుంట శివారులో మంగళవారం పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసినట్లు ఎస్సై ప్రవీణ్‌కుమార్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. పక్కా సమాచారం మేరకు పోలీసులు సాయికుంట శివారులోని చెట్ల పొదలపై ఆకస్మిక దాడి నిర్వహించారు. పేకాడుతున్న మంచిర్యాలకు చెందిన గడ్డం శంకరయ్య, బండి రవిని అరెస్ట్ చేయగా మరో ముగ్గురు పరారయ్యారు. వీరి నుంచి రూ.5,070 నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment