● మావోయిస్టు పార్టీ సింగరేణి కోల్‌బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్
మంచిర్యాలరూరల్(హాజీపూర్): బెల్లంపల్లి శాంతిఖని పాత గనిని ఓపెన్‌కాస్ట్‌గా మార్చే ప్రయత్నాలను సింగరేణి సంస్థ విరమించుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) సింగరేణి కోల్‌బెల్ట్ కమిటీ కార్యదర్శి ప్రభాత్ మంగళవారం పత్రికలకు విడుదల చేసిన లేఖలో స్పష్టం చేశారు. శాంతిఖని గనిని ఓపెన్‌కాస్ట్‌గా మారిస్తే పరిసర గ్రామాలైన ఆకెనపల్లి, పాతబెల్లంపల్లి, సుబ్బారావుపల్లె, లింగాపూర్, శ్రావణపల్లి, బఠ్వాన్‌పల్లె గ్రామాలతో పాటు బెల్లంపల్లి పట్టణం విధ్వంసానికి గురవుతుందని తెలిపారు. వ్యవసాయ వనరులు దెబ్బతింటాయని, జలవనరులు అడుగంటుతాయని, వన్యప్రాణులు అంతరించి పోతాయని పేర్కొన్నారు. ప్రజలు నిర్వాసితులుగా మారి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. ఇప్పటివరకు ఓసీపీలు ఏర్పాటు చేసిన ప్రాంతాలు ఎక్కడా అభివృద్ధికి నోచుకున్న దాఖలాలు లేవని పేర్కొన్నారు. నిర్వాసితులను అనాధిగా సింగరేణి యాజమాన్యం ప్రభుత్వాల అండతో మోసగిస్తూనే ఉందని ఆరోపించారు. సింగరేణి మోసపూరిత మాటలు నమ్మకుండా పర్యావరణ పరిరక్షణ, గ్రామ, పట్టణ పరిరక్షణ, వ్యవసాయ భూముల సంరక్షణ కోసం ఓసీపీ విధ్వంసాన్ని వ్యతిరేకించేలా ప్రజలు, ప్రజాసంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. శాంతిఖని ఓసీపీని నిలిపివేయడానికి అధికార పార్టీ ఎమ్మెల్యే వినోద్, ఎంపీ వంశీ బాధ్యతగా చొరవ చూపాలని, లేనిపక్షంలో వీరితో పాటు కాంగ్రెస్ మండల, పట్టణ నాయకులకు ప్రజల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment