బెల్లంపల్లిలో రెచ్చిపోయిన దొంగలు
● పట్టపగలే రూ.4.40లక్షలు చోరీ ● బైక్‌పై ఉడాయించిన యువకులు
బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో దొంగలు శుక్రవారం పట్టపగలే రెచ్చిపోయారు. మార్కెట్‌లో మోటార్‌సైకిల్ పార్కింగ్ చేసి పక్కన కూరగాయలు కొనుగోలు చేస్తుండగా.. రెప్పపాటు వ్యవధిలో దొంగలు డబ్బుల కవర్‌ను తస్కరించి పారిపోయారు. బాధితుడు దుర్గం వెంకటస్వామి తెలిపిన వివరాల ప్రకారం.. బెల్లంపల్లి మండలం బట్వాన్‌పల్లి గ్రామానికి చెందిన దుర్గం వెంకటస్వామి మేనకోడలు వివాహం మార్చి 2న ఉంది. అవసరాల నిమిత్తం రూ.4.40లక్షలు స్థానిక ఎస్‌బీఐ బజార్ ఏరియా బ్రాంచిలో ఉదయం 11.30గంటలకు డ్రా చేశాడు. నగదును ఓ కవర్‌లో ఉంచి మోటార్‌సైకిల్ పెట్రోల్ ట్యాంకుపై ఉన్న కవర్‌లో భద్రపర్చాడు. కూరగాయలు తీసుకు రావాలని ఇంటి నుంచి ఫోన్ రావడంతో స్థానిక మార్కెట్ మెట్ల వద్ద పార్కింగ్ చేశాడు. మోటార్‌సైకిల్‌ను గమనిస్తూనే కూరగాయలు కొనుగోలు చేస్తున్నాడు. ఇంతలో గుర్తు తెలియని వ్యక్తులు మోటార్‌సైకిల్ వద్దకు వచ్చి నగదు ఉన్న కవర్‌ను దొంగిలించారు. ఓ యువకుడు బ్యాగ్ పట్టుకుని అప్పటికే అక్కడ మోటార్‌సైకిల్‌పై సిద్ధంగా ఉన్న మరో యువకుడితో పారిపోయాడు. వెంకటస్వామి గమనించి కొంతదూరం వెంబడించినా ప్రయోజనం లేకపోయింది. ఇద్దరు యువకులు తలకు టోపీ ధరించి ముఖం కనిపించకుండా జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలుస్తోంది. నిమిషాల వ్యవధిలో జరిగిన ఈ చోరీ పుర ప్రజలను కలవరపాటుకు గురి చేసింది. బాధితుడు వెంకటస్వామి వన్‌టౌన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో దేవయ్య తెలిపారు.
సీసీ పుటేజీ పరిశీలించిన పోలీసులు
బ్యాంకులోని సీసీ పుటేజీని వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో ఎన్.దేవయ్య పరిశీలించారు. వెంకటస్వామి ఏ సమయానికి బ్యాంకుకు వచ్చాడు, ఎవరైనా అతడిని అనుసరించారా అని పరిశీలించారు. దొంగలు ఎలా ఉంటారనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. సీసీ పుటేజీలోని ఓ యువకుడిపై అనుమానం వచ్చినట్లు సమాచారం. కాంటా చౌరస్తాలో బైక్‌పై ఇద్దరు యువకులు వెళ్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇతర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కాగా, గుర్తు తెలియని వ్యక్తులు బ్యాంకు వద్ద మాటు వేసి వెంకటస్వామిని అనుసరించి దొంగిలించినట్లుగా తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment