![మహిళల ఉపాధికి ఊతం](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/06cnr101-340089_mr-1738955854-0.jpg.webp?itok=CMJTpSMH)
మహిళల ఉపాధికి ఊతం
● ఆర్థికంగా ఎదిగేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల చర్యలు ● రైతులకు ఆసరాగా నిలిచేందుకు మహిళా సంఘాలకు డ్రోన్లు ● జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ ద్వారా అందించేందుకు ప్రతిపాదనలు
కోటపల్లి: మహిళా సంఘాల్లోని సభ్యులను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా రైతులకు ఆసరాగా ఉండేందుకు మహిళా సమాఖ్యలకు రాయితీలపై డ్రోన్లు అందించే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ కింద ముందుగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున డీఆర్డీఏ నుంచి ప్రతిపాదనలు పంపించారు. జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గం నుంచి భీమారం, మంచిర్యాల నియోజకవర్గం నుంచి దండేపల్లి, బెల్లంపల్లి నియోజకవర్గం నుంచి నెన్నల మండలాలను ఎంపిక చేసి ప్రతిపాదనలు పంపించారు. దీని ద్వారా రైతులకు మేలు చేయడంతో పాటు మహిళా సంఘాల సభ్యులకు ఉపాధి లభిస్తుందనే ఉద్దేశంతో పథకాన్ని అమలు చేయనున్నారు.
80 శాతం రాయితీపై..
రసాయన ఎరువులను డ్రోన్‌ల ద్వారా పిచికారీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రొత్సహిస్తోంది. ఇందులో భాగంగా పలు కంపెనీలు కూడా సహకార సంఘాల ద్వారా డ్రోన్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి. ఇందులో భాగంగా రూ.10 లక్షల డ్రోన్ యంత్రానికి రూ.8 లక్షలు రాయితీ వర్తిస్తుండగా మిగతా రూ.2 లక్షలు మండల మహిళా సమాఖ్యలు భరించాల్సి ఉంటుంది. డ్రోన్లు మండల మహిళా సమాఖ్యలకు అందిన తర్వాత వాటి నిర్వహణకు ఇద్దరిని నియమించనున్నారు. వీరికి శిక్షణ ఇచ్చి పంట పొలాల్లో రసాయనాలు పిచికారీ చేయనున్నారు. డ్రోన్లతో వరి, పత్తి, మామిడి తోటలకు రసాయనాలు పిచికారీ చేసుకునే అవకాశం ఉండగా కూలీల కొరత అధిగమించవచ్చు. ఇది విజయవంతమైతే మండలాల వారీగా విస్తరించేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
పర్యవేక్షణ పెరిగితేనే సత్ఫలితాలు..
ప్రభుత్వం అందిస్తున్న రాయితీ పరికరాలపై అధికారుల పర్యవేక్షణ పెరిగినప్పుడే సత్ఫలితాలు సాధించవచ్చు. గతంలో మహిళా సంఘాల ద్వారా సన్న, చిన్నకారు రైతులకు అందుబాటులో ఉండేందుకు ట్రాక్టర్లు, పనిముట్లు కొనుగోలు చేసి అందించారు. జిల్లాలోని అన్ని మండల సమాఖ్యల ద్వారా కొనుగోలు చేయగా నిరుపయోగంగా మారాయి. కొన్ని మండలాల్లో కొనుగోలు చేసి రెండు, మూడేళ్లు గడిచినా వినియోగించకుండా సెర్ప్ కార్యాలయం వద్ద నిరుపయోగంగా పడి ఉన్నాయి. కొన్ని సంఘాలు అద్దెకు ఇవ్వగా వచ్చిన డబ్బుల కంటే నిర్వహణ భారం ఎక్కువ కావడంతో పక్కన పడేశారు. కాగా రుణ బకాయిలు సంఘాలకు భారంగా మారాయి.
ఉమ్మడి జిల్లా వివరాలు..
జిల్లా గ్రామాఖ్య స్వయం సహాయక సభ్యులు
సంఘాలు సంఘాలు
ఆదిలాబాద్ 557 10920 119664
కుమురంభీం 398 8138 92512
మంచిర్యాల 468 10198 115018
నిర్మల్ 504 12040 138410
ఉపాధి లభిస్తుంది..
మహిళా సంఘాలు ఆర్థికంగా ఎదిగేందుకు ప్రభుత్వాలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా మహిళా సంఘాలకు రాయితీలపై డ్రోన్లు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. దీనిద్వారా రైతులకు అందుబాటులో పిచికారీ యంత్రాలు ఉండటమే కాకుండా మహిళలకు ఉపాధి లభించనుంది. మహిళా సభ్యులకు బాధ్యతలు అప్పగించి పర్యవేక్షణ పెంచుతాం.
– సంజీవ్, డీపీఎం, మంచిర్యాల
Comments
Please login to add a commentAdd a comment