కబడ్డీ చాంపియన్ సూర్యపేట
ఆదిలాబాద్: 71వ అంతర్ జిల్లాల సీనియర్ పురుషుల కబడ్డీ పోటీల్లో సూర్యపేట జట్టు విజేతగా నిలిచింది. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రియదర్శిని స్టేడియంలో ఈ నెల 4న కబడ్డీ పోటీలు ప్రారంభం కాగా శుక్రవారం ముగిసాయి. రాష్ట్ర కబడ్డీ అసోసియేసన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నీలో రాష్ట్రంలోని 34 జిల్లాలకు చెందిన 500మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఫ్లడ్ లైట్ల వెలుతురులో సింథటిక్ మ్యాట్లపై నాలుగు రోజులపాటు డే నైట్ మ్యాచ్‌లు నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో సూర్యపేట జట్టు నల్గొండ జట్టుపై 39–33 పాయింట్ల తేడాతో విజయం సాధించింది. గత ఏడాది సైతం ఈ టోర్నీలో ఈ రెండు జట్లే తలపడగా.. నల్గొండ జట్టు విజేతగా నిలిచింది. ఈసారి చరిత్రను తిరగరాస్తూ సూర్యపేట చాంపియన్ షిప్ కై వసం చేసుకుంది. నల్గొండ రెండో స్థానంలో నిలువగా.. వనపర్తి, రంగారెడ్డి జట్లు సంయుక్తంగా మూడో స్థానంలో నిలిచాయి. విజేతలకు అతిథులు బహుమతి ప్రదానం చేశారు.
త్వరలో తెలుగు కబడ్డీ లీగ్
త్వరలో తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తెలుగు కబడ్డీ లీగ్ ప్రారంభించనున్నట్లు ఇంటర్నేషనల్ కబడ్డీ ఫెడరేషన్ డైరెక్టర్ జగదీశ్వర్ యాదవ్ తెలిపా రు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ మార్చిలో 15రోజు లు హైదరాబాద్‌లో, మరో 15రోజులు విజయవాడ వేదికగా మ్యాచ్‌లు జరుగుతాయని చెప్పారు. ఒక్కో క్రీడాకారుడికి రూ.15లక్షలు చెల్లించి టోర్నీలో ఆడే అవకాశం కల్పిస్తామని వివరించారు. ఆదిలాబాద్‌లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా కబడ్డీ ఉమెన్ అకాడమీ ఏర్పాటుకు స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు కేంద్రానికి వినతిపత్రం అందించారని తెలిపారు. ఇక్కడ ఏర్పాటుకు తనవంతు కృషి చేస్తామని హామీనిచ్చారు. రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు కాసాని వీరేష్‌ముదిరాజ్ ఆధ్వర్యంలో వచ్చే జూన్ నుంచి హైదరాబాద్‌లో కబడ్డీ అకాడమీ ప్రారంభిస్తామని తెలిపారు. ఇందులో 40 మంది క్రీడాకారులకు ఉచిత శిక్షణ అందిస్తామని, ఈ సదావకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే రెసిడెన్షియల్ కోచింగ్ క్యాంపులు నిర్వహించేందుకు సమాలోచనలు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇండియన్ కబడ్డీ టీం మాజీ కోచ్ ఎల్.శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ కోశాధికారి రవికుమార్, రాష్ట్ర సంఘం జాయింట్ సెక్రెటరీ గట్టయ్యయాదవ్, జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు ఉష్కం రఘుపతి, ప్రధాన కార్యదర్శి రాష్ట్రపాల్, అంతర్జాతీయ కబడ్డీ క్రీడాకారుడు సతీష్‌కుమార్, రెఫరీ బోర్డ్ చైర్మన్ అనిల్‌కుమార్, హైదరాబాద్ కబడ్డీ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ సత్యనారాయణ, రాష్ట్ర సెలక్షన్ కమిటీ మెంబర్ విఠల్‌యాదవ్ పాల్గొన్నారు.
రెండో స్థానంలో నల్గొండ జట్టు
హోరాహోరీగా సాగిన ఫైనల్ మ్యాచ్
Comments
Please login to add a commentAdd a comment