మిగిలింది.. సోమవారమే
● ఒక్కరోజే భారీగా నామినేషన్లు ● గ్రాడ్యుయేట్స్‌కి 28, టీచర్స్‌కు 2, మొత్తం 30 ● ర్యాలీగా నామినేషన్లు వేసిన నరేందర్‌రెడ్డి, అంజిరెడ్డి ● స్వతంత్రులుగా రవీందర్‌సింగ్, హరికృష్ణ నామపత్రాలు ● నేడు, రేపు సెలవు దినాలు మిగిలింది ఒక్కరోజే
సాక్షి ప్రతినిధి, కరీంననగర్: ఉమ్మడి కరీంనగర్– మెదక్– నిజామాబాద్– ఆదిలాబాద్ జిల్లాల గ్రా డ్యుయేట్స్, టీచర్స్ ఎమ్మెల్సీ స్థానాలకు నామినేషన్లు పోటెత్తాయి. శుక్రవారం మంచిరోజు కావడంతో ఆయాస్థానాలకు పోటీ చేస్తున్న ఆశావహులు అనుచరగణంతో భారీర్యాలీగా వచ్చి నామినేషన్లు వేశారు. గ్రాడ్యుయేట్స్ స్థానానికి 28మంది, టీచర్స్‌స్థానానికి రెండు మొత్తం 30 నామపత్రాలు వేశారు. ఈనెల 3వ తేదీన నామినేషన్ల పర్వం మొదలైనప్పటికీ.. శుక్రవారం దాఖలైన నామపత్రాలు అత్యధి కం కావడం గమనార్హం. ఉదయం ఆల్ఫోర్స్ విద్యాసంస్థల అధినేత, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి కుటుంబ సభ్యులతో వచ్చి నామినేషన్ వేశారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డితో నామినేషన్ దాఖలు చేశారు. బీఆర్‌ఎస్ టికెట్ ఆశించి భంగపడ్డ మాజీ మేయర్ రవీందర్‌సింగ్, ప్రసన్న హరికృష్ణ స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. వీరిలో రవీందర్‌సింగ్ సన్నిహితులతో రాగా, హరికృష్ణ అనుచరులు, కళాకారులతో భారీ ర్యాలీగా వచ్చారు. వీరితోపా టు సామాజిక ఉద్యమకారులు బక్క జడ్సన్, సిలివేరు శ్రీకాంత్, మాజీ డీఎస్పీ మదనం గంగాధర్, లక్ష్య స్కూల్స్ అధినేత ముస్తాక్‌అలీ నామినేషన్ పత్రాలను కలెక్టర్ పమేలా సత్పతికి అందజేశారు.
నేడు, రేపు సెలవు
శనివారం, ఆదివారం సెలవుదినం కావడంతో నా మినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉండదు. ఇక మిగిలింది 10వ తేదీ మాత్రమే. సోమవారం చివరి రోజు కూడా భారీగా నామినేషన్లు దాఖలు అయ్యే అవకా శముంది. ఇంతవరకూ వేయని వారితోపాటు రెండోసారి వేసేవారికి అదే చివరి అవకాశం. సోమవా రం కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, మెదక్ జిల్లా మంత్రి దామోదర రాజనరసింహాలతో కలిసి భారీ ఊరేగింపుగా వచ్చి మరోసారి నామినేషన్ దాఖలు చేయనున్నారు. రవీందర్ సింగ్ కూడా రెండోసెట్ దాఖలుకు ర్యాలీ తీయనున్నారు. న్యాయవాది మెతుకు హేమలత పటేల్ గ్రాడ్యుయేట్ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. ఇప్పటి వరకూ దాఖలైన నామినేషన్లలో హేమలత ఏకై క మహిళ కావడం విశేషం.
విజయాన్ని సోనియాకు అందజేస్తాం: నరేందర్‌రెడ్డి
తనపై నమ్మకంతో తనకు అవకాశం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి, సోనియాగాంధీకి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గెలిచి కానుకగా అందజేస్తానని నరేందర్‌రెడ్డి అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనతికాలంలోనే నిరుద్యోగుల సమస్యలు తీర్చిందన్నారు. మేనిఫెస్టోతో పట్టభద్రులను చేరుకుంటామని, 10న మంత్రులు, అగ్రనేతలతో రెండోసెట్ దాఖలు చేస్తామని తెలిపారు.
ఓటుతో బుద్ధి చెప్పండి: అంజిరెడ్డి
కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఇలా అన్నివర్గాల హామీలు నెరవేర్చడంలో విఫలమైందని అంజిరెడ్డి అన్నారు. అందుకే, ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ప్రభుత్వ పనితీరు మరీ అధ్వానంగా ఉందన్నారు. ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి ఆ పార్టీకి బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా కోరారు.
ప్రశ్నించే గొంతుకనవుతా: ప్రసన్న హరికృష్ణ
తన 19 సంవత్సరాల ప్రభుత్వ ఉద్యోగ జీవితానికి రాజీనామా చేసి నిరుద్యోగులు, ఉద్యోగులు, యువత పక్షాన ప్రశ్నించే గొంతుకనై వారి సమస్యల పరిష్కారానికి పోరాడుతానని ప్రసన్న హరికృష్ణ అన్నారు. మీ వాడిగా, మీ గొంతుకగా, మీ సమస్యల పరిష్కరానికి నిత్యం పోరాటం చేయడానికే పట్టభద్రుల ఎమ్మెల్సీ స్ధానానికి నామినేషన్ వేసిన తనను గెలిపించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment