రైతుల కష్టాలు పట్టని ప్రభుత్వం
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ
రామాయంపేట(మెదక్)/చిన్నశంకరంపేట/మెదక్ కలెక్టరేట్: కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల గురించి ఎంతమాత్రం పట్టించుకోవడం లేదని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షురాలు పద్మ ఆరోపించారు. మంగళవారం రామాయంపేటలోని దళితవాడలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి మాట్లాడారు. నెల రోజుల క్రితం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించినా ఇప్పటివరకు రైస్ మిల్లులు అలాట్ చేయకపోవడం సరికాదన్నారు. సకాలంలో తూకం వేయకపోవడంతో రైతులు అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం వెంటనే కొనుగోళ్లు ప్రారంభించి తడిసిన ధాన్యాన్ని కొనాలని డిమాండ్ చేశారు. ఆమె వెంట మున్సిపల్ చైర్మన్ జితేందర్‌గౌడ్, సహకార సంఘం చైర్మన్ చంద్రం, కౌన్సిలర్ అనిల్ తదితరులు పాల్గొన్నారు. అలాగే నార్సింగి మండలంలోని జప్తిశివనూర్ కొనుగోలు కేంద్రం వద్ద తడిసిన ధాన్యం పరిశీలించారు. కార్యక్రమంలో నార్సింగి, చిన్నశంకరంపేట బీఆర్‌ఎస్ మండలాల అధ్యక్షులు మైలారం బాబు, పట్లోరి రాజు, మాజీ వైస్ ఎంపీపీ సుజాత, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టి ఆదుకోవాలని బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ నగేష్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం బేషరతుగా తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, వడ్ల తేమ శాతాన్ని 17 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment